Shahid Afridi: అక్తర్ బౌలింగ్ చేస్తుంటే సచిన్ కాళ్లు వణకడం చూశాను: అఫ్రిదీ
- భారత ఆటగాళ్లపై మరోసారి వ్యాఖ్యలు చేసిన అఫ్రిదీ
- అక్తర్ బౌలింగ్ లో సచిన్ భయపడ్డాడని వెల్లడి
- సయీద్ అజ్మల్ ను చూసి కూడా హడలిపోయాడని వ్యాఖ్యలు
భారత క్రికెటర్లన్నా, భారత్ అన్నా విపరీతమైన విద్వేషం ప్రదర్శించే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ మరోసారి అసంబద్ధ వ్యాఖ్యలు చేశాడు. షోయబ్ అక్తర్ ను ఎదుర్కొనేందుకు సచిన్ టెండూల్కర్ జంకేవాడని, ఓసారి అక్తర్ బౌలింగ్ చేస్తుండగా భయంతో సచిన్ కాళ్లు వణకడం తాను స్పష్టంగా చూశానని గతంలో ఓసారి తెలిపిన అఫ్రిదీ ఇప్పుడా వ్యాఖ్యలను సమర్ధించుకున్నాడు. ఆ సమయంలో తాను స్క్వేర్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తుండడం వల్ల సచిన్ కాళ్లు వణకడం బాగా కనిపించిందని చెప్పాడు.
ఒకానొక సమయంలో అక్తర్ బౌలింగ్ ను ఎదుర్కోవడం సచిన్ కే కాదని, ప్రపంచంలోని మేటి ఆటగాళ్లకు కూడా కష్టసాధ్యంగా మారిందని పేర్కొన్నాడు. "మిడాఫ్ లో కానీ, కవర్స్ లో కానీ వున్న ఫీల్డర్ బ్యాట్స్ మెన్ బాడీ లాంగ్వేజి బాగా పరిశీలించవచ్చు. ప్రతిసారి సచిన్ ను భయపెట్టేలా బౌలింగ్ చేశాడని చెప్పను కానీ, కొన్ని స్పెల్స్ లో మాత్రం అక్తర్ భీతిగొలిపే రీతిలో బంతులేశాడు. అక్తర్ ఫామ్ లో ఉన్నప్పుడు సచిన్ తో సహా అగ్రశ్రేణి బ్యాట్స్ మెన్ అందర్నీ బ్యాక్ పుట్ పై ఆడేలా భయపెట్టాడు" అని వివరించాడు.
అంతేకాదు, 2011 వరల్డ్ కప్ సమయంలోనూ సచిన్ తమ స్పిన్నర్ సయీద్ అజ్మల్ ను చూసి హడలిపోయాడని అఫ్రిదీ తెలిపాడు. బౌలర్లను చూసి బ్యాట్స్ మెన్ భయపడడం పెద్ద విషయమేమీ కాదని, కొన్ని సమయాల్లో బ్యాట్స్ మెన్ ఒత్తిడికి గురవుతుంటారని వివరించాడు.