Raghu Ramakrishna Raju: తనపై ఏపీ మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంపై రఘురామకృష్ణరాజు స్పందన
- రఘురాజుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మంత్రి రంగనాథరాజు
- నేను 20 రోజుల క్రితమే ఫిర్యాదు చేశానన్న రఘురాజు
- ఇంత వరకు కేసు నమోదు కాలేదని మండిపాటు
వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలకు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
రఘురాజుపై మంత్రి శ్రీరంగనాథరాజు పశ్చిమగోదావరి జిల్లా పోడూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన దిష్టిబొమ్మను దగ్ధం చేయించారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ అంశంపై రఘురాజు స్పందించారు. శ్రీరంగనాథరాజు తనపై ఫిర్యాదు చేయడం సరికాదని అన్నారు. తన దిష్టిబొమ్మను దహనం చేశారంటూ 20 రోజుల క్రితమే ఫిర్యాదు చేశానని... అయినా ఇంత వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదని చెప్పారు. ఇప్పుడు తానే దిష్టిబొమ్మను దగ్ధం చేశానని తప్పుడు ఫిర్యాదు చేశారని మండిపడ్డారు.