Bolivia: కరోనా కోరల్లో చిక్కుకున్న బొలీవియా అధ్యక్షురాలు.. ఐసోలేషన్‌లో ఉండి పనిచేస్తానని ప్రకటన
- ఆమె మంత్రి వర్గంలో నలుగురికి కరోనా
- ఆరోగ్యం బాగానే ఉందన్న అధ్యక్షురాలు
- వెనిజులా అసెంబ్లీ అధ్యక్షుడికి కూడా..
కరోనా మహమ్మారి బారినపడిన దేశాధ్యక్షుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మొన్నటికి మొన్న బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో కరోనా బారినపడగా, తాజాగా బొలీవియా తాత్కాలిక అధ్యక్షురాలు జీనిన్ అనెజ్‌కు కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయాన్ని ఆమె నిన్న స్వయంగా ప్రకటించారు.
అయితే, తన ఆరోగ్యం కుదురుగానే ఉందని, ఐసోలేషన్‌లో ఉండి పనిచేస్తానని తెలిపారు. ఆమె మంత్రివర్గంలోని నలుగురు ఇటీవలే ఈ వైరస్ బారినపడడంతో అనుమానంతో జీనిన్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా, వెనిజులా రాజ్యాంగ అసెంబ్లీ అధ్యక్షుడు డియోస్డాడో కాబెల్లో కూడా కరోనా బారినపడినట్టు తెలుస్తోంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా కరోనా కోరల్లో చిక్కుకుని బయటపడిన సంగతి తెలిసిందే.