Nepal: నేపాల్ ప్రధాని కేపీ శర్మ, పార్టీ చైర్మన్ ప్రచండ మధ్య కుదరని సయోధ్య.. చీలిక దిశగా కమ్యూనిస్టు పార్టీ
- సయోధ్యకు రంగంలోకి దిగిన చైనా రాయబారి యాంకుయి
- నిన్న ప్రచండతో ఆయన నివాసంలో చర్చలు
- నేడు తేలిపోనున్న ప్రధాని ఓలి భవితవ్యం
నేపాల్‌లోని అధికార కమ్యూనిస్టు పార్టీలో ముసలం మొదలైంది. పార్టీ చీలక దిశగా పయనిస్తోంది. ప్రధాని కేపీ శర్మ ఓలి, పార్టీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పుష్పకుమార్ దహల్ (ప్రచండ) మధ్య సయోధ్య కుదరకపోవడంతో చీలిక అనివార్యంగా కనిపిస్తోంది.
దీంతో వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు నేపాల్‌లో చైనా రాయబారి అయిన హౌ యాంకుయి రంగంలోకి దిగారు. వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. నిన్న ప్రచండను ఆయన నివాసంలో కలిసిన యాంకుయి చర్చలు జరిపారు. నేడు జరగనున్న పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఓలి రాజకీయ భవితవ్యం తేలిపోనుంది. మరోవైపు, పార్టీ స్టాండింగ్ కమిటీ ఇప్పటి వరకు నాలుగుసార్లు భేటీ అయినా వివాదాన్ని పరిష్కరించే దిశగా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేకపోయింది.