India: సరికొత్త రికార్డుకు బంగారం ధర... హైదరాబాద్ లో 10 గ్రాములు రూ. 51,460!
- రూ. 51,460కి పది గ్రాముల ధర
- వెండి ధర కిలోకు రూ. 51,900
- ఇంకా పెరుగుతాయంటున్న నిపుణులు
భారత మార్కెట్లో బంగారం ధర మరో ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 470 పెరిగి రూ. 51,460కి చేరుకుంది. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ. 1,880 పెరిగి రూ. 51,900కు చేరుకుంది. న్యూఢిల్లీలో బంగారం ధర రూ. 50,184గా, ముంబైలో రూ. 49,239కి పెరిగింది.
కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి అధికంగా ఉండటం, స్టాక్ మార్కెట్లు అనిశ్చితిలో కొనసాగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు బులియన్ మార్కెట్ వైపు పరుగులు పెడుతున్నారు. తమ పెట్టుబడులకు బంగారం మంచి రాబడులను ఇస్తుందని ఇన్వెస్టర్లు నమ్ముతున్నారని బులియన్ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలావుండగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,800 డాలర్లకు పైగా చేరగా, వెండి ధర 18 డాలర్లను అధిగమించింది. బంగారం ధరల పెరుగుదల మరికొంతకాలం కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియాలో త్వరలో శ్రావణ మాసం ప్రారంభం కానుండటంతో కొనుగోళ్లు ఊపందుకుంటాయని, బంగారం ధరలు ఇంకాస్త పెరుగుతాయని వెల్లడించారు.