USA: పాకిస్థాన్ విమానాలపై నిషేధం విధించిన అగ్రరాజ్యం అమెరికా
- పాక్‌కు చెందిన పైలట్లలో చాలా మంది నకిలీ డిగ్రీలు
- ఇప్పటికే పలు ఇతర దేశాలు కూడా చర్యలు
- ఈయూ కూడా ఆరు నెలలపాటు నిషేధం
పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)కు చెందిన అన్ని విమానాలపై అగ్రరాజ్యం అమెరికా నిషేధం విధించింది. పాక్‌కు చెందిన పైలట్లలో చాలా మంది నకిలీ డిగ్రీలతో ఉద్యోగాలు పొందినవారే ఉన్నారని ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకుంటున్నామని అమెరికా అధికారులు ప్రకటించారు.
పాక్ పైలట్లలో మూడో వంతు మంది దగ్గర నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని ఇటీవల తేలింది. దీంతో పైలట్ల విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆందోళన వ్యక్తంచేసింది. అమెరికానే కాకుండా, ఇప్పటికే పలు ఇతర దేశాలు కూడా ఈ చర్యలు తీసుకున్నాయి.
ఐరోపా సమాఖ్య పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన అన్ని విమానాలపై ఇప్పటికే ఆరు నెలలపాటు నిషేధం విధించింది. ఈయూకు పాక్ అంతర్జాతీయ విమానాలు నడపొద్దని పేర్కొంది. పాకిస్థాన్‌లోని కరాచీలో ఈ ఏడాది మే 22న ఇళ్లపై ఓ విమానం కూలడంతో 97 మంది మృతిచెందారు.
దీంతో దీనిపై విచారణ చేపట్టిన అధికారులకు ఆ విమానం నడిపిన పైలట్ల వద్ద నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని తెలిసింది. దీనిపై విచారణ చేపట్టగా చాలా మంది వద్ద ఇలాగే నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని నిర్ధారణ అయింది. దీంతో ప్రపంచంలోని పలు దేశాలు పాక్ విమానాలపై నిషేధం విధిస్తున్నాయి.