Muralidhar Rao: గుడి కూలిపోయింది.. కేసీఆర్ ప్రభుత్వానికి కూడా దినం దగ్గరపడింది: మురళీధర్ రావు ఫైర్
- గుడిని కావాలనే కూల్చేశారు
- కేసీఆర్ నిజస్వరూపాన్ని బయటపెడతాం
- ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన కేసీఆర్ పత్తా లేకుండా పోయాడు
హైదరాబాదులోని సెక్రటేరియట్ కూల్చివేత పనుల కారణంగా అక్కడ ఉన్న నల్లపోచమ్మ గుడితో పాటు మసీదు ధ్వంసమైన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మాట్లాడుతూ, గుడిని కావాలనే కూలగొట్టారని... పొరపాటున కూలిపోయిందని అబద్ధాలు చెపుతున్నారని మండిపడ్డారు. గుడిని కూలగొట్టిన కేసీఆర్ ప్రభుత్వానికి దినం కూడా దగ్గర పడిందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి పిండం పెట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్ ను ప్రజలు ఎన్నుకున్నది గుడిని కూల్చేందుకు కాదని అన్నారు.
ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రచారం చేస్తూ తాను అసలుసిసలైన హిందువునని చెప్పుకున్నారని... కానీ ఈరోజు జరిగిన ఘటనతో ఆయన హిందువు కాదని తేలిపోయిందని మురళీధర్ రావు దుయ్యబట్టారు. కరోనాను ఎదుర్కోవడంలో కేసీఆర్ సర్కారు ఘోరంగా విఫలమైందని... పేషెంట్లకు కనీస వసతులు కూడా లభించడం లేదని మండిపడ్డారు. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ దొరకడం లేదని విమర్శించారు. కరోనా కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి కేసీఆర్ ప్రభుత్వమే కారణమని చెప్పారు.
కరోనా సంక్షోభ సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన కేసీఆర్... పత్తా లేకుండా పోయారని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎక్కడున్నాడని అడిగిన వారిని అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నిజ స్వరూపాన్ని త్వరలోనే ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. కేసీఆర్ ను 24 గంటలూ అగ్గి మీద నిలబెడతామని హెచ్చరించారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని అన్నారు.
మాట్లాడిపోయే ముఖ్యమంత్రితో తెలంగాణ రాష్ట్రం పైకి రాదని మురళీధర్ రావు అన్నారు. ప్రచారాలతో పని జరగదని, ప్రజలకు అండగా ఉంటూ పని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలు భయాందోళనలతో బతుకుతున్నారని తెలిపారు. కరోనాకు ముందు, కరోనాకు తర్వాత అనే విధంగా ప్రపంచం మారిపోతుందని ప్రధాని మోదీ చెప్పారని... ఈ విషయం కేసీఆర్ కు అర్థమైనట్టు లేదని అన్నారు. కరోనా ప్రభావాన్ని మోదీ ముందే పసిగట్టారని, అందుకే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రకటించారని చెప్పారు.
దేశం బాగుంటేనే ఏ పార్టీ అయినా బాగుంటుందని ... దేశమే లేకపోతే పార్టీలు, రాజకీయాలు, ప్రభుత్వాలు ఉండవని అన్నారు. ప్రధాని ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని కూడా కేసీఆర్ ఎద్దేవా చేశారని మండిపడ్డారు.