amazon: టిక్‌టాక్‌ను నిషేధించి.. మళ్లీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న అమెజాన్!
- సమాచారం టిక్‌టాక్ ద్వారా తస్కరణకు గురయ్యే ప్రమాదం
- తాజాగా ఉద్యోగులకు మెయిల్స్ పంపిన అమెజాన్
- తప్పుగా పంపామని మరో ప్రకటన చేసిన ఈ-కామర్స్ సంస్థ
- ఆ యాప్‌కు సంబంధించి విధానాల్లో మార్పు లేదని వివరణ
మొబైల్ ఫోన్లలో చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్‌ను వాడొద్దంటూ తన ఉద్యోగులకు సూచించిన ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్, ఆ ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటల్లోనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. తాము పంపే ఈ-మెయిల్స్‌లోని సమాచారం టిక్‌టాక్ ద్వారా తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని, భద్రతా కారణాల దృష్ట్యా మొబైల్ ఫోన్ల నుంచి ప్రతి అమెజాన్ ఉద్యోగి ఆ యాప్‌ను తొలగించాలని ఇటీవల ఈ-మెయిల్స్ ద్వారా పేర్కొంది. ల్యాప్‌టాపుల్లో మాత్రం టిక్‌టాక్‌ను వాడొచ్చని తెలిపింది.
అయితే, ఈ ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు తాజాగా మరో ప్రకటనలో పేర్కొంది. టిక్‌టాక్ పై బ్యాన్ ప్రకటన పొరపాటున చేశామని అమెజాన్ చెప్పుకొచ్చింది. తమ ఉద్యోగుల్లో కొందరికి ఈ-మెయిల్స్ తప్పుగా పంపించామని, ఆ యాప్‌కు సంబంధించి ప్రస్తుతం తమ విధానాల్లో ఎలాంటి మార్పు లేదని ప్రకటించింది.
టిక్‌టాక్‌పై విధించిన బ్యాన్‌ను వెనక్కి తీసుకోవడానికి కారణాన్ని చెప్పడానికి అమెజాన్ ప్రతినిధి జాకీ అండర్సన్ సుముఖత వ్యక్తం చేయలేదు. ఇప్పటికే టిక్‌టాక్‌పై భారత్‌లో నిషేధం విధించిన విషయం తెలిసిందే. అమెరికాలోనూ ఈ యాప్‌పై నిషేధం విధించాలని యోచిస్తున్నారు.