Sharad Pawar: ఇందిరాగాంధీ, వాజ్ పేయిలాంటి మహామహులే ఓడిపోయారు.. బీజేపీ ఓటమికి ఇదే కారణం: 'సామ్నా'కు శరద్ పవార్ ఇంటర్వ్యూ

Even Indira Gandhi and Vajpayee lost elections says Sharad Pawar

  • ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామనే అహంకారం పనికి రాదు
  • విర్రవీగే వారిని ప్రజలు ఇంటికి పంపిస్తారు
  • శివసేనతో ఎలాంటి విభేదాలు లేవు

ఓటర్లను తక్కువగా అంచనా వేయొద్దని బీజేపీకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హితవు పలికారు. ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్ పేయి వంటి మహామహులకే ఓటర్లు చుక్కలు చూపించారని, ఎన్నికల్లో ఓడించారని గుర్తు చేశారు.

 'నేను మళ్లీ వస్తా' అంటూ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎన్నికల సమయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ ను ప్రదర్శించారని... దీంతో ఆయన అహంకారం ప్రజలకు అర్థమయిందని, బీజేపీని అధికారానికి దూరం చేశారని చెప్పారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు తలెత్తాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని పవార్ చెప్పారు. శివసేన అధికార పత్రిక 'సామ్నా' ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర కామెంట్లు చేశారు.

ప్రజాస్వామ్య దేశంలో ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామనే భావనలో ఉండరాదని పవార్ చెప్పారు. ఇలాంటి భావజాలాన్ని ఓటర్లు అంగీకరించరని అన్నారు. ఎంతో మంది పవర్ ఫుల్ లీడర్లు కూడా ఓడిపోయారని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఓడిపోవడానికి ఇదే కారణమని అన్నారు. రాజకీయ నాయకుడి కంటే సామాన్యుడు తెలివైనవాడని చెప్పారు. అందుకే 'మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం' అంటూ విర్రవీగేవారిని ప్రజలు ఇంటికి పంపిస్తారని అన్నారు.

లోక్ సభ ఎన్నికల సమయంలో దేశ వ్యాప్తంగా ప్రజల సెంటిమెంట్ భిన్నంగా ఉందని... ఆ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా వాతావరణం ఉందని పవార్ చెప్పారు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీకి ప్రజాదరణ తగ్గిందని అన్నారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల ప్రజలు మార్పును కోరుకున్నారని చెప్పారు.

లాక్ డౌన్ కు సంబంధించి సీఎం ఉద్ధవ్ థాకరేతో విభేదాలు ఉన్నాయా? అనే ప్రశ్నకు సమాధానంగా... అలాంటిది ఏమీ లేదని పవార్ అన్నారు. విభేదాలు రావడానికి అవకాశమే లేదని చెప్పారు. లాక్ డౌన్ సమయంలో సీఎంకు, తనకు మధ్య మంచి కమ్యూనికేషన్ ఉందని... రాబోయే కాలంలో కూడా ఇదే మాదిరి కలసికట్టుగా పనిచేస్తామని తెలిపారు.

దివంగత బాల్ థాకరే ఏనాడూ అధికార స్థానం (సీఎం)లో కూర్చోకపోయినా.. అధికారాన్ని నడిపించే శక్తిగా ఆయన ఉన్నారని పవార్ చెప్పారు. తన సిద్ధాంతాల కారణంగానే బాల్ థాకరే మహారాష్ట్రలో తన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని తెలిపారు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం బాల్ థాకరే సిద్ధాంతాల ఆధారంగా అధికారంలోకి రాలేదని చెప్పారు. ప్రజలు కట్టబెట్టిన ఈ అధికారాన్ని, అధికార బాధ్యతను సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉద్ధవ్ థాకరేపై ఉందని చెప్పారు. ఇదిలావుంచితే, శివసేన అధికార పత్రిక అయిన సామ్నా ఇతర పార్టీల వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం ఇదే ప్రథమం.

  • Loading...

More Telugu News