Donald Trump: ఇండియా, చైనాల మధ్య యుద్ధమే వస్తే, ట్రంప్ భారత్ వైపు నిలబడరట!
- మరోసారి గెలిస్తే ఏం చేస్తారో కూడా ఊహించలేము
- చైనాతో తిరిగి సంబంధాలు పెట్టుకోవచ్చు
- అమెరికా జాతీయ భద్రత మాజీ సలహాదారు జాన్ బోల్డన్
భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిన వేళ, ఇండియాకు మద్దతు ఇస్తున్నట్టు మాట్లాడుతున్న ట్రంప్, ఒకవేళ ఉద్రిక్తతలు పెరిగి యుద్ధమే వస్తే, ఇండియా వైపు నిలబడతారన్న నమ్మకం లేదని అమెరికా జాతీయ భద్రత మాజీ సలహాదారు జాన్ బోల్డన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా, ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, చైనా తన సరిహద్దుల్లో దూకుడుగా ఉంటున్న కారణంతోనే పలు దేశాలతో దాని సంబంధాలు క్షీణించాయని అన్నారు.
చైనా, భారత్ ల మధ్య వార్ జరిగితే, ట్రంప్ ఇండియా వైపు ఉంటారన్న గ్యారంటీ లేదని, నవంబర్ ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే, ఆయన వచ్చే నాలుగేళ్లలో ఏం చేస్తారో కూడా ఊహించలేమని అన్నారు. చైనాతో ప్రస్తుతమున్న వాణిజ్య సంబంధాలను ట్రంప్ కొనసాగించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని, ఎన్నికల్లో తిరిగి తానే గెలుస్తానన్న నమ్మకాన్ని కోల్పోయిన ట్రంప్, వచ్చే రెండు, మూడు నెలల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని అన్నారు. కాగా, బోల్టన్ 2018 ఏప్రిల్ నుంచి 2019 సెప్టెంబర్ వరకూ యూఎస్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారన్న సంగతి తెలిసిందే.