Bill Gates: డబ్బులు ఇచ్చే వారికి వద్దు... కరోనా వ్యాక్సిన్ తొలుత ఎవరికన్న విషయంలో బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు!
- అత్యవసరమైన దేశాలకు మాత్రమే ఇవ్వాలి
- పేద దేశాలకు వ్యాక్సిన్ ఇవ్వాలి
- లేకుంటే వైరస్ కట్టడి కాబోదన్న బిల్ గేట్స్
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు ఎన్నో దేశాల శాస్త్రవేత్తలు పరుగులు పెడుతున్నారు. మూడు కంపెనీలు మూడో దశ ప్రయోగాల స్థాయికి కూడా వచ్చేశాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇచ్చి, మార్కెట్లోకి వచ్చేందుకు మార్గం సుగమమైతే, ఎక్కువ డబ్బులను ఇచ్చేవారికి కాకుండా, అవసరమైన దేశాలకు మాత్రమే తొలుత సరఫరా చేయాలని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైరస్ కట్టడిలో ఉన్న దేశాలను పక్కన పెట్టాలని ఆయన సూచించారు.
వ్యాక్సిన్ అవసరమైన దేశాలకు ఇవ్వకుండా, డబ్బులు ఇచ్చేవారికి సరఫరా చేస్తే, వైరస్ ను అంతం చేయలేమని, దాని వ్యాప్తి కొనసాగుతూనే ఉంటుందని అభిప్రాయపడ్డ బిల్ గేట్స్, ఈ విపత్కర పరిస్థితుల్లో డబ్బు గురించి కాకుండా, ప్రజల సంక్షేమం గురించి యోచించాలని వ్యాక్సిన్ తయారీకి కృషి చేస్తున్న కంపెనీలకు ఆయన సూచించారు. ఈ విషయంలో మార్కెట్ శక్తులకు అడ్డుకట్ట వేయాల్సి వుందని, అందరికీ సమన్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకోవాల్సి వుందని అన్నారు.
వేల కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టి వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నా, అవసరార్థులకు మాత్రమే తొలుత వ్యాక్సిన్ అందాలని సూచించిన బిల్ గేట్స్, ఈ విషయంలో ఎయిడ్స్ ను ఉదాహరణగా చూపారు. 20 ఏళ్ల క్రితం ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వేళ, అన్ని దేశాలూ కలసి పనిచేశాయని, దీని ఫలితంగానే ఇప్పుడు ఆఫ్రికాలో సైతం హెచ్ఐవీ మందులు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. అదే స్ఫూర్తిని కరోనా విషయంలోనూ చూపిస్తే, ఈ మహమ్మారిని అణచి వేయవచ్చని అన్నారు.