Corona Virus: ఏపీలో కరోనా మరణమృదంగం... ఒక్కరోజులో 19 మంది మృత్యువాత
- రాష్ట్రంలో 328కి పెరిగిన కరోనా మరణాలు
- 24 గంటల వ్యవధిలో 1,933 మందికి పాజిటివ్
- తాజాగా 846 మంది డిశ్చార్జి
ఏపీలో కరోనా వైరస్ మృత్యుఘంటికలు మోగిస్తోంది. 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 19 మంది మరణించారు. కర్నూలు జిల్లాలో నలుగురు, శ్రీకాకుళం జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లాలో ఒకరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు కరోనాతో ప్రాణాలు విడిచారు. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా మరణాల సంఖ్య 328కి పెరిగింది.
ఇక, కొత్తగా 1,933 మందికి కరోనా కేసులు గుర్తించారు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 268, కర్నూలు జిల్లాలో 237, కృష్ణా జిల్లాలో 206 మందికి కరోనా సోకినట్టు తేలింది. నేటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 29,168కి చేరింది. తాజాగా 846 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,412కి చేరింది. ఇంకా 13,428 మంది చికిత్స పొందుతున్నారు.