Tolet Board: జంట నగరాల్లో ఎక్కడ చూసినా టు-లెట్ బోర్డులే!
- హైదరాబాద్ మహానగరంలో కరోనా స్వైరవిహారం
- నగరం వదిలి వెళ్లిపోతున్న వలసజీవులు
- ఖాళీగా దర్శనమిస్తున్న అద్దె ఇళ్లు
కరోనా వైరస్ మనిషి జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తోంది. జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. నగరాల్లో ఈ పరిస్థితి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలనే తీసుకుంటే అభివృద్ధికి చిరునామాలుగా విలసిల్లిన ఈ జంటనగరాలు ఇప్పుడు జనాల్లేక బోసిపోయాయి. కరోనా భయంతో వలసజీవులందరూ స్వస్థలాలకు వెళ్లిపోవడంతో ఇళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
ఒకప్పుడు టు-లెట్ బోర్డు పెట్టిన కొద్ది వ్యవధిలోనే ఆ ఇంట్లో ఎవరో ఒకరు చేరేవారు. ఇప్పుడు టు-లెట్ బోర్డు పెట్టి నెలలు గడుస్తున్నా ఒక్కరంటే ఒక్కరూ రాని పరిస్థితి ఏర్పడింది. సగానికి సగం అద్దెలు తగ్గిస్తామన్నా వచ్చేవారు కరవయ్యారు. అద్దె ఇళ్లు చూపించే బ్రోకర్లు కూడా ఈ పరిస్థితిలో కుదేలయ్యారు. వారికి ఉపాధి లేకుండా పోయింది. అటు ప్రముఖ విద్యాకేంద్రాలు కొలువుండే అమీర్ పేట్, అశోక్ నగర్, ఎస్సార్ నగర్ వంటి ప్రాంతాల్లో హాస్టళ్లు సైతం మూతపడ్డాయి.
హైదరాబాద్ మహానగరం జనాభా కోటికి పైనే ఉంటుంది. వారిలో 60 శాతానికి పైగా వివిధ అవకాశాల కోసం ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చినవారే. అయితే హైదరాబాదులో రాబోయే రెండు నెలల్లో కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తుందన్న ప్రచారంతో వారు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఇప్పటివరకు ఆరేడు లక్షల మంది హైదరాబాద్ ను వీడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. సాధారణ గృహాలకే కాదు, కొన్ని అపార్ట్ మెంట్లలోని ఫ్లాట్లకూ ఈ పరిస్థితి తప్పడంలేదు. ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే మాత్రం హైదరాబాదులో ఇళ్ల యజమానులకు అద్దెలపై వచ్చే ఆదాయంలో గణనీయంగా కోతపడుతుంది. ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందో చూడాలి!