Rajasthan: ఆసక్తి రేపుతున్న రాజస్థాన్ వ్యవహారం: అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేపీ బలాబలాలివి
- మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు
- కాంగ్రెస్ కు ప్రస్తుతం 121 మంది ఎమ్మెల్యేల బలం
- బీజేపీకి ఉన్నది 73 మంది మాత్రమే
- తన వద్ద 30 మంది ఉన్నారంటున్న సచిన్ పైలట్
రాజస్థాన్ లో సచిన్ పైలట్ వర్గం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై తీవ్ర ఆగ్రహంతో ఉండి, పార్టీని వీడి, బీజేపీకి మద్దతు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చిందన్న వార్తలు వినిపిస్తున్న వేళ, మరోసారి రాష్ట్ర అసెంబ్లీలో గణాంకాలు తెరపైకి వచ్చాయి. మొత్తం 200 మంది సభ్యులున్న రాజస్థాన్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 101. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తన సభ్యులు, ఇతర మద్దతుదారులతో కలిసి 121 మంది ఎమ్మెల్యేల బలంతో ప్రభుత్వాన్ని నడుపుతోంది.
వాస్తవానికి ఈ బలం కాంగ్రెస్ కు ఐదేళ్లూ ప్రభుత్వం నడిపించేందుకు సరిపోతుంది. అయితే, సీఎంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పైలట్ వర్గం ఇప్పుడు పార్టీని మారే ఆలోచనలో ఉంది. ఆయనకు 16 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర సభ్యుల బలముందని తెలుస్తోంది. రాజస్థాన్ లో కాంగ్రెస్ కు 101 మంది ఎమ్మెల్యేలుండగా, మాయవతి నేతృత్వంలోని బహుజన సమాజ్ పార్టీ ఆరుగురు ఎమ్మెల్యేలతో కూటమిలో భాగంగా ఉన్నారు. వీరికి 10 మంది స్వతంత్ర్య ఎమ్మెల్యేలు, సీపీఐ-ఎం, భారతీయ ట్రైబల్ పార్టీలకు చెందిన ఇద్దరేసి సభ్యుల మద్దతు ప్రస్తుతం ఉంది.
బీజేపీకి రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ సభ్యులు ముగ్గురితో కలిపి 73 మంది ఎమ్మెల్యేల బలముంది. ఇక, ప్రభుత్వాన్ని కూలదోయాలంటే బీజేపీకి కనీసం మరో 28 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. సచిన్ పైలట్ వర్గం 19 మంది బీజేపీకి మద్దతుగా నిలుస్తారని అనుకున్నా, అధికారానికి ఆ పార్టీకి మరో 10 మంది వరకూ ఎమ్మెల్యేల మద్దతు అవసరమవుతుంది.
సచిన్ పైలట్ వర్గం వస్తే, స్వతంత్ర సభ్యులను సులువుగా ఆకర్షించవచ్చని బీజేపీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో అది అంత సులువు కాదని, మిగతా రాష్ట్రాలకు, దేశ ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరిస్తున్న వారూ లేకపోలేదు. ఇందుకు కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ ఆరేళ్ల వ్యవధిలో బీజేపీ, పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేసిందన్న చెడ్డ పేరును తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ విషయంలో బీజేపీ ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తోంది.