Digital classes: దేశంలోని 62 శాతం కుటుంబాల్లో ఆగిన చదువు.. విద్యార్థుల్లో పెరిగిన నిరక్ల్య ధోరణి: తాజా సర్వే
- కరోనా కారణంగా ఆన్‌లైన్ విద్యాబోధన
- సమాజంలో ఆర్థిక అంతరాలు పెంచుతున్న వైనం
- ప్రతీ పదిమందిలో నలుగురు ఆటపాటల్లో
కరోనా వైరస్ ఏమంటూ పుట్టుకొచ్చిందో కానీ దేశంలోని 62 శాతం కుటుంబాల్లోని పిల్లల చదువును చిదిమేసింది. ఈ కారణంగా విద్యార్థుల్లో చదువుపై నిర్లక్ష్యం కూడా పెరిగినట్టు ఇటీవల జరిగిన ఓ సర్వే వెల్లడించింది. ‘సేవ్ ది చిల్డ్రన్’ అనే స్వచ్ఛంద సంస్థ దేశంలోని 15 రాష్ట్రాల్లోని 7,235 కుటుంబాలపై సర్వే నిర్వహించగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. కరోనా కారణంగా ఆన్‌లైన్ విద్యాబోధన జరుగుతున్నప్పటికీ ఇది విద్యార్థుల మధ్య అంతరాలు పెంచేసిందని, ఇది పెను ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
విద్య డిజిటలీకరణ ప్రభావం దక్షిణ భారతదేశంలో అంతగా లేనప్పటికీ ఉత్తర భారతదేశ విద్యార్థులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నట్టు సర్వే తేల్చింది. కరోనా కారణంగా స్కూళ్ల మూసివేతతో తమ పిల్లలకు మధ్యాహ్న భోజనం కరవైందని 20 శాతం కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఇంట్లోనే చదువు కారణంగా ప్రతీ పదిమంది విద్యార్థుల్లో నలుగురు ఆటపాటల్లో మునిగి తేలుతున్నట్టు సర్వే వివరించింది.