USA: అమెరికాపై ఇండియా 'డిజిటల్ స్ట్రయిక్'... ప్రతీకారేచ్ఛలో ట్రంప్!

Indias Digital Strikes on Us

  • గూగుల్, ఫేస్ బుక్ తదితరాలను టార్గెట్ చేసిన ఇండియా
  • అమలులోకి వచ్చిన ఈక్వలైజేషన్ టాక్స్
  • గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
  • కొత్త పన్నులను విధించే యోచనలో అమెరికా
  • కొత్త తరహా వాణిజ్య యుద్ధం మొదలు

ట్రేడ్ డెఫిసిట్, జీఎస్పీ పన్ను మినహాయింపుల ఎత్తివేత నుంచి తాజాగా హెచ్-1బీ సహా పలు రకాల వీసాలపై ఆంక్షలను విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇప్పుడు ఇండియాపై డిజిటల్ స్ట్రయిక్ ను చేయాలని చూస్తున్నారు. పైకి వ్యూహాత్మక భాగస్వామిలా కనిపిస్తూనే, ఇండియాపై కత్తికట్టిన ఆయన, యూఎస్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అధిక పన్నులను నరేంద్ర మోదీ వేశారని కాస్తంత ఘాటుగానే విమర్శలకు దిగారు.

తాజాగా ఇప్పుడు రెండు దేశాల మధ్య కొత్త వివాదం 'గూగుల్ టాక్స్' రూపంలో పెరుగుతోంది. ఇది ముదిరితే ఇండియాలో తయారయ్యే వస్తువులపై అమెరికాలో పన్నుల భారం గణనీయంగా పెరుగుతుంది. నిజానికి ఈ చట్టాన్ని 2016-17లో ఈక్వలైజేషన్ టాక్స్ పేరిట ప్రవేశపెట్టగా, అది ఈ సంవత్సరం జూన్ నుంచి అమలులోకి వచ్చింది. దేశం బయట శాశ్వత కార్యాలయాలను నిర్వహిస్తూ, వాణిజ్య ప్రకటనల ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్న ఫేస్ బుక్, గూగుల్, ట్విట్టర్ వంటి దిగ్గజ డిజిటల్ కంపెనీలన్నీ ఈ చట్టం పరిధిలోకి వచ్చాయి.

దీంతో ఈ చట్టానికి 'గూగుల్ టాక్స్' అన్న పేరు వచ్చింది. ఈ కంపెనీలకు ఇండియా నుంచి అత్యధిక ఆదాయం లభిస్తుందన్న సంగతి తెలిసిందే. భారీ ఎత్తున ఆదాయం పొందుతూ కూడా ఈ డిజిటల్ కంపెనీలు చెల్లించాల్సిన స్థాయిలో పన్నులను చెల్లించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇండియా టాక్స్ సిస్టమ్ లో డిజిటల్ వరల్డ్ కు సంబంధించిన సరైన చట్టాలు లేకపోవడంతో అమెరికా కేంద్రంగా నడుస్తున్న కంపెనీలకు అది వరంగా మారింది. ఇక్కడి వాణిజ్య ప్రకటనల డబ్బంతా విదేశాల్లోని సంస్థ ప్రధాన కార్యాలయాలకు చేరుతోంది.

ఈ కంపెనీలు తమ అనుబంధ భారత విభాగాల చివర 'ఇండియా లిమిటెడ్' అని పేరుకు మాత్రమే తగిలించుకుంటున్నాయి. ఈ కంపెనీల నుంచి పన్నులు వసూలు కావడం లేదని గ్రహించిన భారత ప్రభుత్వం ఈ నూతన పన్ను మార్పులను తీసుకుని వచ్చింది. ఇండియాలోని చట్టాల్లోని లొసుగులను అడ్డు పెట్టుకుని డబ్బు దోచుకుంటున్న డిజిటల్ సంస్థలకు అడ్డుకట్ట వేయడమే దీని ప్రధాన ఉద్దేశం.

ఇండియాలో పొందుతున్న ఆదాయాన్ని నిర్వహణ, వివిధ రకాల వ్యయాల కింద చూపుతూ, విదేశాల్లోని అనుబంధ కంపెనీలకు ఈ డబ్బులను అవి తరలిస్తున్నాయన్నది ప్రధాన ఆరోపణ. గతంలో ఓ టెక్ దిగ్గజం ఇలాగే రూ. 16 వేల కోట్లను సింగపూర్ కు తీసుకెళ్లినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇటువంటి ఆరోపణల నేపథ్యంలో ఫ్రాన్స్ గతంలో డిజిటల్ సంస్థలపై 3 శాతం పన్నులను వేసింది.

అదే తరహా విధానాన్ని ఇండియాలోనూ అవలంబించాలని భావించిన మోదీ సర్కారు, వాణిజ్య ప్రకటనల ఆదాయంపై 6 శాతం పన్ను వేస్తూ, దీన్ని నేరుగా వినియోగదారుడే చెల్లించాలని షరతు పెట్టి, 2019లో రూ. 900 కోట్లకు పైగా ఆదాయాన్ని పొందింది. ఆపై 2020లో దీన్ని సవరించి, ఎలాంటి ఆదాయమైనా 2 శాతం డిజిటల్ సేవల పన్ను కట్టాల్సిందేనని చట్టం తేగా, అదిప్పుడు అమలులోకి వచ్చింది.

ఈ కొత్త పన్నుపై ఆగ్రహంతో ఉన్న గూగుల్, ఫేస్ బుక్ వంటి యూఎస్ కంపెనీలు, అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ప్రారంభించగా, ట్రంప్ స్వయంగా కల్పించుకున్నారు. ఇండియా సహా 9 దేశాల్లో డిజిటల్ సంస్థలపై విధిస్తున్న పన్నులను ఆయన పరిశీలిస్తున్నారు. దర్యాఫ్తు సంస్థల నుంచి నివేదికలు తెప్పించుకుని, ఈ పన్నులతో నష్టమెంతన్న విషయాన్ని నిపుణులతో సమీక్షిస్తున్నారు.

డిజిటల్ కంపెనీలపై తొలిసారి పన్నులను విధించిన ఫ్రాన్స్ నుంచి తమ దేశానికి వచ్చే సరుకులపై ఇప్పుడు అమెరికా 25 శాతం మేరకు సుంకాలను పెంచేసింది. ఈ విషయాన్ని యూఎస్టీఆర్ (యూఎస్ ట్రేడ్ రిప్రజంటేటివ్) స్వయంగా వెల్లడించారు. ఇప్పుడు భారత్ సహా పలు దేశాలతో అమెరికా చర్చలు జరుపుతోంది. ఆస్ట్రేలియా, బ్రెజిల్, చెక్ రిపబ్లిక్, యూరోపియన్ యూనియన్, ఇండొనేషియా, ఇటలీ, స్పెయిన్, టర్కీ తదితర దేశాలన్నీ ఈ తరహా పన్నులను విధించాయి. అమెరికాతో ఈ దేశాల చర్చలు ప్రారంభమైన నేపథ్యంలో చాలా డిజిటల్ సంస్థలు ఇప్పటివరకూ కడుతూ వచ్చిన పన్నులను నిలిపివేశాయి.

ఇండియా సహా పలు ఇతర దేశాలు యూఎస్ కంపెనీలపై కుట్రలు చేస్తున్నాయని, వివక్షను ప్రదర్శిస్తున్నాయన్నది అమెరికా ఆరోపణ. పన్ను పరిధి విస్తృతంగా కనిపిస్తున్నా, వచ్చే ఆదాయం చాలా తక్కువగానే ఉంటుందన్నది అమెరికా వాదన. ఆదాయం కోసం తమ కంపెనీలను ఇబ్బంది పెడుతున్నారన్న ఆలోచనలో ఉన్న యూఎస్, భారత ఉత్పత్తులపై పన్నులను మరింతగా పెంచాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇండియాకు చెందిన 6 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను జీఎస్పీ నుంచి బయటకు తెచ్చిన అమెరికా, ఇప్పుడు వాటిని మరింతగా పెంచాలని భావిస్తోంది. దీంతో రెండు దేశాల మధ్యా మరో వాణిజ్య యుద్ధం ప్రారంభం కానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News