Rajasthan: రసకందాయంలో రాజస్థాన్ రాజకీయాలు.. సీఎం గెహ్లాట్ ఇంట్లో సీఎల్పీ సమావేశం ప్రారంభం
- 90 మంది కాంగ్రెస్, 10 మంది స్వతంత్ర ఎమ్మెల్యేల హాజరు
- హాజరుకాని సచిన్ పైలట్
- సమావేశంలో తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ
- సచిన్ పైలట్‌తో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు
రాజస్థాన్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నివాసంలో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి 90 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 10 మంది స్వతంత్రులు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. గెహ్లాట్ ప్రభుత్వం మైనార్టీలో ఉందని చెప్పిన సచిన్ పైలట్.. ఈ భేటీకి రానని నిన్ననే స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధిష్ఠానం తమ పార్టీ నేత కేసీ వేణుగోపాల్‌ను ఈ భేటీకి పంపినట్లు తెలిసింది. అలాగే, రాజస్థాన్ కాంగ్రెస్‌లోని పరిస్థితులపై ఆ పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టి పలు చర్యలు తీసుకుంటోంది.
మరోపక్క, సచిన్ పైలట్ కు అత్యంత సన్నిహితుడైన ధనీశ్ అబ్రర్ ఈ సమావేశానికి హాజరుకావడం గమనార్హం. ఇప్పటివరకు ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరుకాలేదు.
తన వెంట 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారని సచిన్ పైలట్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో జరుగుతోన్న ఈ భేటీ ఉత్కంఠ రేపుతోంది.