Sonu Sood: లాక్ డౌన్ కాలంలో మరణించిన వలస కార్మికులకు ఆర్థిక సాయం చేయనున్న సోనూ సూద్
- లాక్ డౌన్ కాలంలో హీరో అయిన సోనూ సూద్
- 400 కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధం
- అది తన వ్యక్తిగత బాధ్యతన్న సోనూ సూద్
లాక్ డౌన్ కాలంలో భారత్ లో ఎక్కువగా వినిపించిన సెలబ్రిటీ పేరు సోనూ సూద్. ఈ బాలీవుడ్ నటుడు వందలమంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించి మానవత్వానికి ప్రతీకగా నిలిచాడు. వలసజీవుల కోసం బస్సుల నుంచి విమానాల వరకు ఖర్చు ఎంతైనా వెనుకాడకుండా ఏర్పాట్లు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. లాక్ డౌన్ కాలంలో మరణించిన, గాయపడిన వలసకార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని నిశ్చయించాడు. ఆర్థిక సాయం చేసేందుకు వీలుగా వారి చిరునామాలు, బ్యాంకు అకౌంట్ల వివరాలు సేకరిస్తున్నాడు. దీనిపై సోనూ సూద్ బృందం ఆయా రాష్ట్రాల అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. బీహార్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 400 మంది వలస కార్మికుల కుటుంబాలను గుర్తించారు. ఆ కుటుంబాలకు ఆర్థికసాయం చేస్తానని ప్రకటించారు. దీన్ని వ్యక్తిగత బాధ్యతగా భావిస్తున్నట్టు సోనూ సూద్ స్పష్టం చేశారు.