Raghurama Krishnaraju: కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిసిన ఎంపీ రఘురామకృష్ణరాజు
- ఢిల్లీ వెళ్లిన నరసాపురం ఎంపీ
- సొంత పార్టీ ఎమ్మెల్యేలే కేసులు పెడుతున్నారన్న ఎంపీ
- కేంద్రం భద్రత కల్పిస్తుందని ఆశిస్తున్నట్టు వెల్లడి
ఇటీవల కాలంలో నిత్యం వార్తల్లో ఉంటున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ సాయంత్రం కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిశారు. ఢిల్లీ వెళ్లిన ఆయన తన భద్రతపై కేంద్ర హోంశాఖ కార్యదర్శిని వివరాలు అడిగారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే తనపై కేసులు పెడుతున్నారని తెలిపారు. కేసుల నేపథ్యంలో భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కోరానని వెల్లడించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే భద్రత అడిగానని, కేంద్రం భద్రత కల్పిస్తుందని ఆశిస్తున్నానని రఘురామకృష్ణరాజు అన్నారు.
వైసీపీ అంతర్గత కలహాల కారణంగా నరసాపురం పార్లమెంటు స్థానం పరిధిలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీ రఘురామకృష్ణరాజుపై ధ్వజమెత్తారు. కొన్నాళ్లుగా వైసీపీ ఎమ్మెల్యేలకు, రఘురామకృష్ణరాజుకు మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు నడుస్తున్నాయి. పార్టీ అధినాయకత్వం ఆయనకు షోకాజ్ నోటీసులు పంపినా, అందుకు దీటుగా స్పందించి, పార్టీని ఇరకాటంలో పడేసే విధంగా అనేక అంశాలను లేవనెత్తారు. దాంతో ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా స్పీకర్ కు వైసీపీ విజ్ఞప్తి చేసిన విషయం విదితమే.