GSK: కరోనా నివారణకు వృక్ష ఆధారిత వ్యాక్సిన్ రూపొందిస్తున్న ఫార్మా దిగ్గజం
- కెనడా సంస్థ మెడికాగోతో చేతులు కలిపిన జీఎస్కే
- వ్యాక్సిన్ ఇస్తే అధికంగా తయారవుతున్న యాంటీబాడీలు
- వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్
కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు అమితవేగంతో సాగుతున్నాయి. శాస్త్రవేత్తలు అవిశ్రాంతంగా శ్రమిస్తూ, త్వరితగతిన వ్యాక్సిన్ తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలు వ్యాక్సిన్ లు ప్రారంభ దశలు అధిగమించి క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నాయి. తాజాగా, ఫార్మా రంగ దిగ్గజం గ్లాక్సో స్మిత్ క్లైన్ (జీఎస్కే) వృక్ష ఆధారిత వ్యాక్సిన్ ను తీసుకువచ్చేందుకు పరిశోధనలు చేస్తోంది.
కెనడాకు చెందిన మెడికాగో అనే బయో ఫార్మాస్యూటికల్ సంస్థతో కలిసి జీఎస్కే కరోనా వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు చేపడుతోంది. ఈ వ్యాక్సిన్ రెండు పదార్థాల సమ్మిళితం అని చెప్పవచ్చు. జీఎస్కే తయారుచేసిన సహాయక ఔషధానికి, మెడికాగో రూపొందించిన కరోనా వైరస్ ను పోలిన కణాలను జోడించి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్ లో ఉండే కరోనా తరహా కణాలు సార్స్ కోవ్-2ను అనుకరిస్తాయి. ఈ వ్యాక్సిన్ ను మనుషులపై ప్రయోగించినప్పుడు, ఇందులోని కరోనాను పోలిన కణాలను గుర్తించిన వ్యాధి నిరోధక వ్యవస్థ వెంటనే ప్రేరేపితమవుతుంది.
కాగా, మెడికాగో తయారుచేసిన కరోనా తరహా కణాలతో కూడిన వ్యాక్సిన్ కు జీఎస్కే రూపొందించిన సహాయక ఔషధాన్ని జోడించి సింగిల్ డోస్ ఇవ్వగా భారీ సంఖ్యలో యాంటీబాడీలు తయారైనట్టు ప్రారంభ దశ ప్రయోగాల్లో గుర్తించారు. ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున, ఇది వచ్చే ఏడాది ద్వితీయార్థం నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ లో జీఎస్కే తయారుచేసిన సహాయక ఔషధాన్ని వృక్ష సంబంధ పదార్థాల నుంచి అభివృద్ధి చేశారు.