WHO: ఇలాగైతే కరోనా మరింత భీకరంగా మారే ప్రమాదం: డబ్ల్యూహెచ్‌వో
- ప్రపంచ దేశాలు కరోనాను అదుపు చేయలేకపోతున్నాయి
- తప్పుడు విధానాలతో ప్రపంచ దేశాలు వెళ్తున్నాయి
- అందుకే కేసులు పెరుగుతున్నాయి
- ప్రజలకు కరోనా నంబర్ వన్ శత్రువుగానే ఉంది
కరోనాను అదుపు చేయలేకపోవడమే కాకుండా తప్పుడు విధానాలతో ప్రపంచ దేశాలు వెళ్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాగైతే కరోనా మరింత భీకరంగా మారే ప్రమాదముందని తెలిపింది. డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ... ప్రపంచ దేశాలు అనుసరించాల్సిన సరైన చర్యలను అమలు చేయట్లేదని, అందుకే కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.
ఆయా దేశాల అధినేతల నుంచి వస్తున్న మిశ్రమ సందేశాలు ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేటట్లు చేస్తున్నాయని చెప్పారు. ప్రజలకు కరోనా నంబర్ వన్ శత్రువుగానే ఉందన్నారు. అయితే, దాన్ని ఎదుర్కోవడంలో ప్రజల చర్యలు ఆ స్థాయిలో లేవని తెలిపారు.
భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్కులను ధరించడం లాంటి అంశాలను ప్రజలు, ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. జాగ్రత్తలు తీసుకోకపోతే సమీప భవిష్యత్తులోనూ సాధారణ పరిస్థితులు నెలకొనడం సాధ్యం కాదని హెచ్చరించారు. పరిస్థితులు మరింత క్లిష్టతరంగా మారే అవకాశం ఉందని చెప్పారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీస్ డైరెక్టర్ డాక్టర్ మైఖ్ ర్యాన్ మాట్లాడుతూ... కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న అగ్రరాజ్యం అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేయడం, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు లేకపోవడం వల్ల మళ్లీ వైరస్ కేసులు విజృంభించినట్లు తెలిపారు.