Pawan Kalyan: విజయనగరంలో బీజేపీ-జనసేన అభ్యర్థిపై హత్యాయత్నం దారుణం: పవన్ కల్యాణ్
- వైసీపీ గూండాలు కత్తులతో దాడి చేశారన్న పవన్
- డీజీపీ సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్
- వైసీపీ గూండాలను కఠినంగా శిక్షించాలన్న ఏపీ బీజేపీ
విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ-జనసేన అభ్యర్థిగా ఉన్న కాళ్ల నారాయణరావుపై అధికార పార్టీ వర్గీయులు హత్యాయత్నం చేయడం దారుణం అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో తన డివిజన్ లో పారిశుద్ధ్య పనులు సరిగా జరగకపోవడంతో, ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారని పవన్ వెల్లడించారు. కానీ, వైసీపీ నాయకులు వలంటీర్ల ద్వారా ఆయనను అడ్డుకున్నారని, తాను ఇదంతా సేవగా భావించి చేస్తున్నానని ఆయన అధికారులకు తెలిపి పారిశుద్ధ్య పనులు కొనసాగించారని వివరించారు.
అయితే వైసీపీ నాయకులు కాళ్ల నారాయణరావును అడ్డుకోవడమే కాకుండా, ఆయన కుటుంబ సభ్యులపైనా దాడి చేశారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని వెల్లడించారు. చివరికి కాళ్ల నారాయణరావుపై వైసీపీ నేతలు హత్యాయత్నానికి దిగారని, కత్తులతో ఆయనపై దాడి చేశారని పవన్ వివరించారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ సమగ్ర విచారణ చేపట్టాలని జనసేనాని డిమాండ్ చేశారు. హత్యాయత్నానికి పాల్పడిన వారిపై విజయనగరం జిల్లా ఎస్పీ తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
అటు, ఈ ఘటనపై ఏపీ బీజేపీ కూడా స్పందించింది. భౌతిక దాడులు, అరాచకాలు, అవినీతి, నిరంకుశత్వం, ఆక్రమణలు, ప్రజల ఆక్రందనలతో రాష్ట్రంలో వైసీపీ పాలన కొనసాగుతోందని విమర్శించింది. విజయనగరంలో బీజేపీ నేత నారాయణరావుపై హత్యాయత్నం చేసిన వైసీపీ గూండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.