Mukesh Ambani: అపర కుబేరుల జాబితాలో ఆరో స్థానంలో ముఖేశ్ అంబానీ
- బ్లూంబెర్గ్ ర్యాంకుల్లో దూసుకుపోతున్న రిలయన్స్ అధినేత
- బఫెట్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్ లను వెనక్కి నెట్టిన ముఖేశ్
- 68 బిలియన్ డాలర్ల నుంచి 72 బిలియన్ డాలర్లకు పెరిగిన సంపద
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో ఆరోస్థానానికి ఎగబాకారు. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ల జాబితాలో ఆయన వారెన్ బఫెట్, గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ లను వెనక్కినెట్టారు. ఇటీవల బ్లూమ్ బెర్గ్ విడుదల చేసిన ర్యాంకుల్లో 8వ స్థానంలో నిలిచిన ముఖేశ్ కొన్ని రోజుల వ్యవధిలోనే 6వ స్థానానికి చేరుకోవడం విశేషం. ఆయన నికర సంపద విలువ 68.3 బిలియన్ల నుంచి 72.4 బిలియన్లకు పెరిగింది.
ఇటీవల కాలంలో రిలయన్స్ గ్రూప్ కు చెందిన జియో ప్లాట్ ఫామ్స్ లోకి అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. దాంతో రిలయన్స్ షేర్ విలువ పెరిగిపోవడమే కాకుండా, ముఖేశ్ అంబానీ ఆస్తి కూడా భారీగా హెచ్చుతోంది.
ఇక, బ్లూమ్ బెర్గ్ రియల్ టైమ్ ర్యాంకింగ్స్ లో ఎప్పట్లాగే అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ టాప్ లో కొనసాగుతున్నారు. ఆయన ఆస్తి విలువను 184 బిలియన్ డాలర్లుగా పేర్కొన్నారు. ఆ తర్వాత రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ (115 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్ (94.5 బిలియన్ డాలర్లు), మార్క్ జుకర్ బర్గ్ (90.8 బిలియన్ డాలర్లు), స్టీవ్ బామర్ (74.6 బిలియన్ డాలర్లు) ఉన్నారు.