Supreme Court: వికాస్ దూబే ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు విచారిస్తున్న వేళ... తెలంగాణ 'దిశ' ప్రస్తావన!
- దూబే ఎన్ కౌంటర్ పై ఉన్నత స్థాయి కమిటీ
- ఎలాంటి కమిటీ కావాలో మీరే చెప్పండి
- యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన సీజే ఎస్ఏ బాబ్డే
ఉత్తరప్రదేశ్ కు చెందిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు ఓ ఉన్నత స్థాయి కమిటీని వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్ కౌంటర్ వెనుక అసలేం జరిగిందో తేల్చాలని దాఖలైన ఓ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై విచారించిన సుప్రీంకోర్టు, తెలంగాణలో జరిగిన 'దిశ' ఎన్ కౌంటర్ ను ప్రస్తావిస్తూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
హైదరాబాద్ శివార్లలో, తన టూ వీలర్ ను నిలిపి, నగరంలోకి వచ్చిన ఓ వెటర్నరీ డాక్టర్ ను ముందుగానే గమనించి, ఆమె బైక్ ను పంక్చర్ చేసి, ఆపై సాయపడుతున్నట్టు నటించి, దారుణంగా ఆత్యాచారానికి పాల్పడిన నలుగురు, ఆపై హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆపై ఒక్కరోజులోనే నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, రెండు రోజుల తరువాత వారిని ఎన్ కౌంటర్ లో కాల్చి చంపారు.
సీన్ రీకన్ స్ట్రక్షన్ నిమిత్తం ఘటనా స్థలికి నిందితులను తీసుకెళ్లగా, వారు తమ వద్ద ఉన్న తుపాకులు లాక్కుని, పారిపోయే ప్రయత్నం చేశారని, ఆత్మరక్షణార్థం జరిపిన కాల్పుల్లో వారు మరణించారని పోలీసులు వెల్లడించారు. దీనిపై విచారణ జరిపించేందుకు అత్యున్నత ధర్మాసనం, రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్పూర్కార్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ విచారణ పూర్తయినా, కరోనా నేపథ్యంలో ఇంతవరకూ నివేదికను అందించలేకపోయింది.
కాగా, ఇదే ఘటనను ప్రస్తావించిన సుప్రీంకోర్టు, తెలంగాణలో జరిగిన ఎన్ కౌంటర్ విషయంలో ఏం చేశామో, వికాస్ దూబే ఎన్ కౌంటర్ విషయంలోనూ తాము అదే చేయాలని అనుకుంటున్నట్టు తెలిపింది. ఎటువంటి కమిటీ కావాలో నిర్ణయించుకోవాలని ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇటువంటి కేసుల్లో తాము కల్పించుకోవాల్సి రావడం పట్ల అయిష్టతను వ్యక్తం చేశారు. గురువారంలోగా తమ నిర్ణయాన్ని చెప్పాలంటూ, తదుపరి కేసు విచారణను 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
కాగా, వికాస్ దూబే ఎన్ కౌంటర్ పై విచారించేందుకు అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి శశికాంత్ అగర్వాల్ తో కూడిన ఏకసభ్య కమిటీని యోగి ప్రభుత్వం నియమించింది. ఆదివారం నాడు ఈ మేరకు ఉత్తర్వులు వెలువడగా, ఎన్ కౌంటర్ కు దారితీసిన పరిస్థితులపై విచారణను ఆయన ప్రారంభించారు.