Sanjay Jha: సచిన్ పైలట్‌పై వేటును తప్పుబట్టిన సీనియర్ నేత సంజయ్ ఝాను పార్టీ నుంచి బహిష్కరించిన కాంగ్రెస్
- పార్టీ కోసం సచిన్ తన రక్తాన్ని ధారపోశారని వ్యాఖ్యలు
- రాజస్థాన్‌లో పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఆయనేనన్న ఝా
- పార్టీలో లోపాలను ఎత్తిచూపుతూ పత్రికలో వ్యాసం
కాంగ్రెస్ నేతలపై అధిష్ఠానం బహిష్కరణల వేటు కొనసాగుతోంది. పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన యువనేత సచిన్ పైలట్‌ను బహిష్కరించిన కొన్ని గంటలకే ఆయనకు మద్దతు పలికిన మహారాష్ట్రకు చెందిన పార్టీ సీనియర్ నేత సంజయ్ ఝాను కూడా బహిష్కరించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. పార్టీ కోసం సచిన్ తన రక్తాన్ని ధారపోశారని, ఆయనపై వేటు సరికాదంటూ పార్టీ నిర్ణయాన్ని ఝా తప్పుబట్టారు. రాజస్థాన్‌లో పార్టీ అధికారంలోకి రావడం ఆయన ఘనతేనంటూ ప్రశంసలు కురిపించారు.
ఆయన వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్న అధిష్ఠానం పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం ఝాకు ఇదే తొలిసారి కాదు. పార్టీలో బోల్డన్ని లోపాలు ఉన్నాయంటూ ఇటీవల ఓ ప్రముఖ పత్రికలో వ్యాసం కూడా రాశారు. పార్టీ తరపున తరచూ ప్రసార మాధ్యమాల్లో పాల్గొనే ఝాను ఇటీవలే అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించింది. ఇప్పుడు ఏకంగా పార్టీ నుంచే బహిష్కరించింది.