Sachin pilot: రాహుల్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నాక నన్ను టార్గెట్ చేశారు: సచిన్ పైలట్
- గెహ్లాట్‌పై ఏడాది కాలంగా పోరాడుతున్నా
- ఆయనపై నాకు కోపం లేదు
- ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలన్నదే నా డిమాండ్
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై తనకు ఎటువంటి కోపం లేదని తిరుబాటు నేత సచిన్ పైలట్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నుంచి తాను ఎలాంటి ప్రత్యేక అధికారాలను కోరుకోవడం లేదన్న ఆయన.. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నదే తన డిమాండ్ అని స్పష్టం చేశారు.
రాజస్థాన్ అభివృద్ధికి పాటుపడుదామనుకుంటున్న తనను, తన అనుచరులను గెహ్లాట్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తన వద్దకు ఫైళ్లు పంపవద్దని, తన మాట వినవద్దని అధికారులకు సూచిస్తున్నారని అన్నారు. ప్రజలకు తానిచ్చిన హామీలు నెరవేర్చకుంటే తనకు వారెలా విలువ ఇస్తారని పైలట్ ప్రశ్నించారు.
బీజేపీతో కలిసి రాజకీయం చేస్తున్నారన్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని సచిన్ కొట్టిపడేశారు. రాహుల్ గాంధీ అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయిన తర్వాతి నుంచి గెహ్లాట్ మద్దతుదారులు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఆత్మగౌరవం కోసం ఏడాది కాలంగా గెహ్లాట్‌తో తాను అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉన్నానని సచిన్ వివరించారు. తనకు ఎదురైన ఇబ్బందులను గతంలో అధిష్ఠానం దూతల వద్ద ప్రస్తావించానని, గెహ్లాట్ దృష్టికి కూడా తీసుకెళ్లానని, అయినా ఎలాంటి ఫలితమూ లేకుండా పోయిందని సచిన్ ఆవేదన వ్యక్తం చేశారు.