Mukesh Ambani: జియోలో గూగుల్ వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటుంది: ముఖేశ్ అంబానీ
- జియోలో గూగుల్ రూ. 33,737 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది
- జియో ప్లాట్ ఫాంలో గూగుల్ వాటా 7.7 శాతం
- రిలయన్స్ అప్పులు లేని సంస్థగా అవతరించింది
రిలయన్స్ జియో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో గూగుల్ భారీగా పెట్టుబడులు పెడుతున్నట్టు ఆ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ ప్రకటించారు. జియోలో రూ. 33,737 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టబోతున్నట్టు తెలిపారు. ఇండియా డిజిటైజేషన్ ఫండ్ కోసం కేటాయించిన 10 బిలియన్ డాలర్లలో దాదాపు సగం పెట్టుబడిని గూగుల్ జియోలో పెడుతోందని అన్నారు. జియోలో గూగుల్ 7.7 శాతం వాటాను పొందిందని చెప్పారు. జియోలో గూగుల్ వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటుందని చెప్పారు. 43వ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వివరాలను వెల్లడించారు.
మూడు నెలల కంటే తక్కువ కాలంలోనే రిలయన్స్ రూ. 2,12,809 కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని అంబానీ చెప్పారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీకి ఉన్న అప్పులు రూ. 1,61,035 కోట్ల కంటే కొత్తగా వచ్చిన పెట్టుబడులు చాలా ఎక్కువని తెలిపారు. దీంతో రిలయన్స్ ఇప్పుడు అప్పులు లేని సంస్థగా అవతరించిందని చెప్పారు. అప్పులు లేని సంస్థగా అవతరించేందుకు 2021 మార్చిని తాము టార్గెట్ గా పెట్టుకున్నామని... అయితే, దానికంటే చాలా ముందుగానే లక్ష్యాన్ని చేరుకున్నామని తెలిపారు.