KTR: కేటీఆర్ కు తమ గోడు వెళ్లబోసుకున్న కుటుంబం.. అండగా నిలిచిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్
- కాన్వాయ్ కు అడ్డుపడిన వెంకటేశ్ కుటుంబం
- తమకు అమ్మిన భూమిని ఇతరులకు కూడా అమ్మారని గోడు
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన కాన్వాయ్ కు ఒక కుటుంబం అడ్డుపడిన సంగతి తెలిసిందే. వీరన్నపేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన అనంతరం తిరుగుప్రయాణం అవుతుండగా... గంటేల వెంకటేశ్ కుటుంబ సభ్యులు కాన్వాయ్ కి అడ్డుపడ్డారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారి సమస్యను అడిగి తెసుసుకున్నారు. వెంకటేశ్ కుటుంబానికి భూమిని అమ్మిన వ్యక్తి... అదే భూమిని మరోకరికి కూడా విక్రయించారని తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరిస్తానని మాట ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం శ్రీనివాస్ గౌడ్ ఈ విషయంపై దృష్టి సారించారు. మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టాలని అదనపు కలెక్టర్ సీతారామరావును ఆదేశించారు. వెంకటేశ్ కుటుంబానికి భూమిని తిరిగి ఇప్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేటీఆర్ కాన్వాయ్ కు అడ్డుపడిన వెంకటేశ్ ది నిరుపేద కుటుంబమని చెప్పారు. పేదలను మోసం చేసే వారిని క్షమించేది లేదని హెచ్చరించారు. భూమిని విక్రయించిన వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని డీఎస్పీని ఆదేశించారు.