Ramana Dikshitulu: రమణదీక్షితులు రాజకీయాలు చేయడం మంచిది కాదు: టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
- టీటీడీ ఈవో, ఏఈవోలపై రమణదీక్షితులు విమర్శలు
- దర్శనాలు వద్దని చెపుతున్నా వినడం లేదని వ్యాఖ్య
- మీడియా ముఖంగా మాట్లాడటం సరికాదన్న వైవీ సుబ్బారెడ్డి
తిరుమల అర్చకులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు 15 మంది అర్చకులకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని... మరో 25 మంది రిపోర్టులు రావాల్సి ఉందని చెప్పారు. తిరుమలలో భక్తులకు దర్శనాలు వద్దని తాను చెపుతున్నా టీటీడీ ఈవో, ఏఈవో పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. వీరిద్దరూ ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు విధానాలనే పాటిస్తున్నారని విమర్శించారు.
ఈ నేపథ్యంలో రమణదీక్షితులు వ్యాఖ్యలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తప్పుపట్టారు. టీటీడీ విషయంలో రమణదీక్షితులు రాజకీయాలు చేయడం మంచిది కాదని అన్నారు. రమణ దీక్షితులుని ముఖ్యమంత్రి జగన్ గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించారని గుర్తు చేశారు. అర్చకుల విషయంలో టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రమణదీక్షితులుని పిలిచి మాట్లాడమని అధికారులతో చెప్పానని తెలిపారు. టీటీడీకి ఆయన ఆగమ సలహాదారుడు కూడా అని చెప్పారు. ఆయన ఏవైనా సలహాలు ఇవ్వాలనుకుంటే టీటీడీ బోర్డుకు ఇవ్వాలని... మీడియా ముఖంగా మాట్లాడటం సరికాదని సుబ్బారెడ్డి అన్నారు.