Yarlagadda: కరోనాతో సహజీవనం చేయాలని జగన్ చెప్పినప్పుడు అందరూ అవహేళన చేశారు!: యార్లగడ్డ
- కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు
- పెద్ద సంఖ్యలో టెస్టులు చేయిస్తున్నారు
- దేశానికే జగన్ ఆదర్శంగా నిలిచారు
కరోనా వైరస్ ప్రపంచాన్నే వణికిస్తోందని... ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కరోనా ప్రబలకుండా ముఖ్యమంత్రి జగన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని ఏపీ తెలుగు భాషా సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కోవిడ్ టెస్టులను నిర్వహిస్తున్నారని కితాబునిచ్చారు.
పేషెంట్లకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు పలు కీలక నిర్ణయాలను తీసుకుంటూ దేశానికే జగన్ ఆదర్శంగా నిలిచారని చెప్పారు. కరోనాతో సహజీవనం చేయాలని జగన్ చెప్పినప్పుడు అందరూ అవహేళన చేశారని, ఆ మరుసటి రోజు ప్రధాని మోదీ కూడా అదే ప్రకటన చేయడంతో... విమర్శలు చేసిన వారు తలదించుకున్నారని అన్నారు. ఈరోజు యార్లగడ్డ తిరుమలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో పాలనా వ్యవహారాలను తెలుగు భాషలో అమలు చేసే విధంగా చర్యలు తీసుకున్నామని యార్లగడ్డ చెప్పారు. జిల్లా స్థాయిలో అందరూ తమ సూచనలను పాటిస్తున్నారని... సచివాలయంలో మాత్రం అమలు చేయడం లేదని చెప్పారు. తెలుగు పదాలు అందరికీ అర్థమయ్యేలా 'పాలనా పదకోశం మీకోసం' అంటూ ప్రతులను తయారు చేసి సచివాలయంలోని ప్రతి అధికారికి అందజేస్తామని తెలిపారు.