Car: కారులో దొరికిన రూ. 5.22 కోట్లు నావే: జువెలరీ వ్యాపారి నల్లమల్లి బాలు
- ఏపీ, తమిళనాడు బోర్డర్ లో కారులో దొరికిన డబ్బు
- మంత్రి బాలినేని డబ్బు అంటూ ప్రచారం
- బంగారం కొనేందుకు తీసుకెళ్తున్నామన్న బాలు
ఏపీ, తమిళనాడు బోర్డర్ లో ఫార్చ్యూనర్ కారులో రూ. 5.22 కోట్లు దొరకడం రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు పుట్టించింది. వైసీపీ మంత్రి బాలినేనికి సంబంధించిన డబ్బు అనే ప్రచారం జరిగింది. కారుపై గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటం విపక్షాలకు మరింత బలాన్ని ఇచ్చింది. అధికార పార్టీపై విపక్ష నేతలు విమర్శలతో విరుచుకుపడ్డారు.
ఈ నేపథ్యంలో ఒంగోలుకు చెందిన జువెలరీ వ్యాపారి నల్లమల్లి బాలు ఒక వీడియో విడుదల చేశారు. ఆ డబ్బు తమదేనని ఆయన చెప్పారు. లాక్ డౌన్ కారణంగా గత నాలుగు నెలలుగా బంగారాన్ని కొనలేకపోయామని... అందుకే ఇప్పుడు కొనడానికి డబ్బును తీసుకెళ్తున్నామని చెప్పారు. అన్ని పత్రాలు చూపించి నగదును విడిపించుకుంటామని తెలిపారు.
ఈ వ్యవహారాన్ని ఒక రాజకీయపార్టీకి చెందిన నేతలతో ముడిపెట్టి మాట్లాడుతున్నారని... అందులో నిజం లేదని బాలు అన్నారు. ఏ పార్టీకి, ఏ నాయకుడికి దీంతో సంబంధం లేదని చెప్పారు. మరోవైపు, ఈ అంశంపై ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్పందించారు. తన స్టిక్కర్ ను వాడుకోవడం చట్ట విరుద్ధమని... వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు.