Kulbhushan Jadhav: పాక్ జైల్లో ఉన్న కుల్ భూషణ్ జాదవ్ ను కలిసేందుకు భారత్ కు అనుమతి
- 2019 సెప్టెంబరులో తొలిసారి దౌత్యపరమైన అనుమతి
- మరోసారి జాదవ్ ను కలవనున్న భారత్ దౌత్య అధికారులు
- మరణశిక్ష ఎదుర్కొంటున్న జాదవ్
గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ జైల్లో మగ్గిపోతున్న కుల్ భూషణ్ జాదవ్ ను కలిసేందుకు భారత్ కు మరోమారు దౌత్యపరమైన అనుమతి లభించింది. తమ దేశ రహస్యాలను భారత్ కు చేరవేస్తున్నాడంటూ జాదవ్ ను పాక్ భద్రతా బలగాలు అరెస్టు చేయగా, మిలిటరీ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే.
మరణశిక్షపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు జూలై 20 తుదిగడువు కాగా, సమయం మించిపోతుండడంతో జాదవ్ ను కలిసేందుకు భారత్ చేసిన విజ్ఞప్తిని పాక్ అంగీకరించింది. ఈ క్రమంలో దౌత్యపరమైన అనుమతులు మంజూరు చేసింది. జాదవ్ తో భారత దౌత్యవర్గాలు రెండు గంటల పాటు మాట్లాడనున్నాయి.
ఇంతకుముందు 2019 సెప్టెంబరులో తొలిసారి దౌత్యపరమైన అనుమతి ఇచ్చిన పాక్, మళ్లీ ఇన్నాళ్లకు ఆ అవకాశం కల్పిస్తోంది. కాగా, కిందటివారం పాక్ కుట్ర పూరిత వ్యాఖ్యలతో తన నైజం వెల్లడి చేసింది. మరణశిక్షపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు జాదవ్ తిరస్కరిస్తున్నాడని, క్షమాభిక్ష పైనే ఆశలు పెట్టుకున్నాడంటూ అతడ్ని దోషిగా ముద్రవేయడానికి ప్రయత్నించింది. దీన్ని తోసిపుచ్చిన భారత్... అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాల అమలులో పాక్ ఎంత చిత్తశుద్ధితో ఉందో దీని ద్వారా తెలిసిపోతోందని వ్యాఖ్యానించింది.
అంతకుముందు, జాదవ్ విషయంలో పాక్ ఏకపక్షంగా మరణశిక్ష విధించిందంటూ భారత్ ఆ విషయాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై విచారణ జరిపిన ఐసీజే... జాదవ్ మరణశిక్షపై పునఃసమీక్ష జరపాలంటూ ఆదేశాలు ఇచ్చింది. జాదవ్ న్యాయ సహాయం పొందేందుకు వీలుగా దౌత్య పరమైన అనుమతులు ఇవ్వకపోవడం వియన్నా ఒప్పందాన్ని తుంగలో తొక్కడమేనని, నాలుగ్గోడల మధ్య ఏకపక్షంగా సాగిన విచారణ ఓ ప్రహసనం అని ఐసీజే పేర్కొంది.