Uttam Kumar Reddy: కేసీఆర్ తన ఫోబియాను పక్కనబెట్టి ఉస్మానియాలో కొత్త భవనం నిర్మించాలి: ఉత్తమ్ కుమార్

Uttam Kumar Reddy demands KCR must build a new building in Osmania hospital

  • ఉస్మానియా ఆసుపత్రిలో పర్యటించిన ఉత్తమ్
  • రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న వైనం
  • సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి హైదరాబాదులోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో పర్యటించారు. హైదరాబాదులో కురుస్తున్న వర్షాలకు ఉస్మానియా ఆసుపత్రిలో నీళ్లు నిలిచాయంటూ మీడియాలో కథనాలు వస్తున్న నేపథ్యంలో... అక్కడి రోగులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అత్యవసర విభాగం సూపరింటిండెంట్ తోనూ, ఆర్ఎంవోతోనూ ఉస్మానియా ఆసుపత్రి సమస్యలు, పరిస్థితులపై చర్చించారు. ఆసుపత్రి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.

"రాష్ట్రంలో ఉస్మానియా ఆసుపత్రి అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది, అతి పెద్దది. ప్రతిరోజూ 2000 మంది ఔట్ పేషెంట్లు ఉస్మానియా ఆసుపత్రికి వస్తుంటారు. ఏడాదికి 60 వేల శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. ఇలాంటి ఆసుపత్రి చిన్నపాటి వర్షానికే జలమయం కావడం, వార్డుల్లో నీరు నిలవడం, మోకాలి లోతు నీళ్లలో రోగులు ఉండడం కేసీఆర్ ప్రభుత్వానికి సిగ్గుచేటు.

నిజాం కాలంలో నిర్మితమైన పాత ఆసుపత్రి భవనాన్ని బలోపేతం చేయాలి. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించాలి. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కాంప్లెక్స్ ప్రాంగణంలో రూ.500 కోట్ల అంచనాలతో నిర్మించతలపెట్టిన కొత్త భవనానికి వెంటనే నిధులు మంజూరు చేయాలి. పాత సచివాలయం కూల్చివేత, కొత్త సచివాలయ నిర్మాణం అంటూ కేసీఆర్ తన భయాలను పక్కనబెట్టి ఉస్మానియాలో కొత్త భవనం నిర్మించాలి" అంటూ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News