Mumbai: 23 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ డైమండ్ స్మగ్లర్
- సింగపూర్ నుంచి బంగారం, వజ్రాల స్మగ్లింగ్
- ప్రభుత్వానికి రూ. 130 కోట్ల పన్ను ఎగవేత
- ఎట్టకేలకు అరెస్ట్ చేసిన ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు
బంగారం, వజ్రాల స్మగ్లింగ్ కేసులో పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారిన నిందితుడు ఎట్టకేలకు 23 ఏళ్ల తర్వాత చిక్కాడు. దక్షిణ ముంబైకి చెందిన హరీశ్ కల్యాణ్ దాస్ భావసర్ (53) అలియాస్ పరేశ్ ఝవేరీ అలియాస్ బాబీ బంగారం, వజ్రాల స్మగ్లర్. గత 23 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. సింగపూర్ నుంచి బంగారం, వజ్రాలు స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఈడీ గుర్తించడంతో 1997లో అతడిపై కొఫెపోసా (కన్జర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్‌చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్) చట్టం కింద కేసు నమోదైంది.
సింగపూర్ నుంచి ముడి బంగారం, వజ్రాలను దిగుమతి చేసుకునే హరీశ్ ప్రభుత్వానికి పన్నులు మాత్రం చెల్లించలేదు. మొత్తం 130కోట్ల రూపాయల పన్ను ఎగవేశాడు. దీంతో దర్యాప్తు చేపట్టిన ఈడీ అతడు స్మగ్లింగ్ కూడా చేస్తున్నట్టు గుర్తించింది. అతడిని అరెస్ట్ చేసేందుకు ఆదేశాలు జారీ కాగా, ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులకు తాళం వేసి కనిపించింది. ఆ తర్వాత పోలీసులు పలుమార్లు ఆయనింటికి వెళ్లినప్పటికీ హరీశ్ ఆచూకీ మాత్రం లభ్యం కాలేదని సీఐ వినాయక్ మెర్ తెలిపారు. తాజాగా, అతడు దక్షిణ ముంబైలోని ఖేట్వాడిలో ఉన్నట్టు సమాచారం అందుకున్న క్రైం బ్రాంచ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.