Vikas Dubey: వికాస్ దూబేను అరెస్ట్ చేసినందుకు నజరానా? ఎవరికి ఇవ్వాలో చెప్పాలని మధ్యప్రదేశ్ ను కోరిన యూపీ!
- వికాస్ ఆచూకీపై రూ. 5 లక్షల రివార్డు
- పూర్తి ఘటనపై ఉజ్జయిని పోలీసుల కమిటీ
- నివేదిక ఆధారంగా రివార్డుపై నిర్ణయం
గత వారంలో మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని పట్టణంలో గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే పట్టుబడగా, ఆ మరుసటి రోజే 10వ తేదీన కాన్పూర్ సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ లో పోలీసులు అతనిని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అంతకుముందే వికాస్ దూబే ఆచూకీ తెలిపిన వారికి యూపీ పోలీసులు రూ. 5 లక్షల రివార్డును ప్రకటించారు. ఇప్పుడు ఆ రివార్డును తాము ఎవరికి ఇవ్వాలో తెలియజేయాలంటూ, ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగం మధ్యప్రదేశ్ అధికారులను కోరుతూ ఓ లేఖ రాశారు.
ఈ మేరకు కాన్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నుంచి తమకు లేఖ అందిందని, వికాస్ దూబేను పట్టుకున్న వారి వివరాలను పంపిస్తే, వారికి తాము ప్రకటించిన రివార్డును అందిస్తామని స్పష్టం చేశారని ఉజ్జయిని ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఎస్పీలు అమరేంద్ర సింగ్, రూపేశ్ ద్వివేది, ఆకాశ్ భూరియాలతో కూడిన టీమ్ ను తాము నియమించామని, వారు మొత్తం ఘటనపై పూర్తి విచారణ జరిపి, నివేదిక ఇచ్చిన తరువాత, తాను ఎవరికి రివార్డు ఇవ్వాలన్న విషయమై ప్రతిపాదనలు పంపుతానని అన్నారు.
కాగా, వికాస్ దూబేపై హత్యలు, హత్యాయత్నాలు, నేరపూరిత చర్యలు తదితర 60కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇటీవల కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో వికాస్ తలదాచుకున్నాడన్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లేసరికే, విషయాన్ని తెలుసుకున్న దూబే గ్యాంగ్, పోలీసు బృందంపై దాడి చేసి, కాల్పులు జరిపి ఎనిమిది మందిని పొట్టన బెట్టుకుంది.