Ganguly: గంగూలీకి, ధోనీకి ఉన్న తేడా ఇదే: గౌతం గంభీర్
- గంగూలీ మ్యాచ్ విన్నర్లను తయారు చేశారు
- జట్టును ధోనీ అద్భుతంగా తీర్చిదిద్దాడు
- ఇద్దరి కెప్టెన్సీలను పోల్చి చూడలేం
టీమిండియాను విజయాల బాట పట్టించడంలో మాజీ సారధులు గంగూలీ, ధోనీ ఇద్దరూ తమదైన ప్రత్యేకతను చాటారు. ఒకరు జట్టును విజయాల బాట పట్టిస్తే, మరొకరు జట్టు స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గంగూలీ ఎంతో మంది మ్యాచ్ విన్నర్లను తీసుకొచ్చారని, ధోనీ ఆ పని చేయలేకపోయాడని అన్నారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా గౌతీ మాట్లాడుతూ, టీమిండియాను ధోనీ అద్భుతంగా తీర్చిదిద్దాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని... అయితే, మ్యాచ్ విన్నర్లను మాత్రం తయారు చేయలేకపోయాడని అభిప్రాయపడ్డారు.
జట్టులో మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్న సమయంలో కెప్టెన్ బాధ్యతలను ధోనీ స్వీకరించాడని గంభీర్ తెలిపారు. దీంతో, అప్పటికే జట్టులో ఉన్న దిగ్గజ ఆటగాళ్లతో పాటు, యువ క్రికెటర్లపై కూడా దృష్టి సారించాల్సి వచ్చిందని చెప్పారు. సీనియర్లను నొప్పించకుండానే, జూనియర్లను కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యతను చూసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇది కష్టమైన పనే అయినప్పటికీ... ధోనీ ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాడని కితాబిచ్చారు.
కోహ్లీ, రోహిత్ శర్మలు ధోనీ కెప్టెన్సీలోనే మెరుగయ్యారని గంభీర్ తెలిపారు. ధోనీ కెప్టెన్సీ చివర్లో బుమ్రా జట్టులోకి వచ్చాడని చెప్పారు. వీటన్నిటి నేపథ్యంలో గంగూలీ, ధోనీ కెప్టెన్సీలను పోల్చి చూడటం సరికాదని అన్నారు. మరోవైపు, గంభీర్ అభిప్రాయాలతో మరో మాజీ క్రికెటర్ చోప్రా ఏకీభవించారు. మ్యాచ్ ఫిక్సింగ్ ప్రపంచ క్రికెట్ ను షేక్ చేస్తున్న సమయంలో గంగూలీ జట్టు పగ్గాలను స్వీకరించాడని చెప్పారు. సెహ్వాగ్, యువరాజ్, హర్భజన్ వంటి ఆటగాళ్లకు అవకాశాలిచ్చి ప్రోత్సహించిన ఘనత గంగూలీదేనని తెలిపారు. భారత జట్టుపై గంగూలీ వేసిన ముద్ర చాలా గొప్పదని చెప్పారు.