Silpa Chakrapani Reddy: నాకు కరోనా వచ్చింది... కలవడానికి ఎవరూ రావొద్దు: వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి

YSRCP MLA Shilpa Chakrapani Reddy tests Corona positive

  • తనకు కరోనా వచ్చిందని లేఖను విడుదల చేసిన శిల్పా చక్రపాణిరెడ్డి
  • నెగెటివ్ వచ్చేంత వరకు క్వారంటైన్ లోనే ఉంటానన్న వైసీపీ నేత
  • తనతో గడిపిన అందరూ టెస్టులు చేయించుకోవాలని విన్నపం

ఏపీలో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆ జాబితాలో కర్నూలు జిల్లాకు చెందిన శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కూడా చేరారు. టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆయన క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డి ఓ లేఖను విడుదల చేశారు.  

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా శిల్పా చక్రపాణిరెడ్డి నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక్షలు చేయించుకుని హైదరాబాదుకు వెళ్లిపోయారు. అయితే, పరీక్షల ఫలితాలు వచ్చేసరికి మూడు రోజులు పట్టింది. దీంతో ఆయన హైదరాబాదులో తన నివాసంలో క్వారంటైన్ లో ఉన్నారు.

తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని... దీంతో, క్వారంటైన్ లో ఉంటూ తగిన చికిత్స పొందుతున్నానని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. నెగెటివ్ వచ్చేంత వరకు క్వారంటైన్ లోనే ఉండాల్సిన అవసరం ఉందని... చికిత్స కాలం ముగిసేంత వరకు తనను కలిసేందుకు ఎవరూ రావద్దని విన్నవించారు. కనీసం ఫోన్ ద్వారా మాట్లాడే ప్రయత్నం కూడా చేయవద్దని కోరారు. ఏవైనా అప్ డేట్స్ ఉంటే సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తానని చెప్పారు.

గత కొన్ని రోజులుగా తనతో ఉన్న సన్నిహితులందరికీ కరోనా టెస్టులు చేయడం జరిగిందని... వారందరికీ నెగెటివ్ వచ్చిందని శిల్పా తెలిపారు. ఇటీవల నియోజకవర్గంలో తనతో పాటు కలిసి ప్రయాణించిన ప్రతి ఒక్కరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని విన్నవించారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను కలవాలని సూచించారు. జన సమూహంలోకి వచ్చినప్పుడు కచ్చితంగా మాస్కులు ధరించాలని, భౌతికదూరాన్ని పాటించాలని కోరారు. కోవిడ్ ప్రొటోకాల్ ను ప్రతి ఒక్కరూ పాటించాలని, ఎవరిని వారే రక్షించుకోవాలని సూచించారు. 

  • Loading...

More Telugu News