Money: సొమ్మొకరిది, స్టిక్కర్ మరొకరిది!... తమిళనాడులో నగదు పట్టుబడిన వ్యవహారంలో ఆసక్తికర అంశాలు!
- తమిళనాడులో రూ.5.27 కోట్ల నగదుతో కారు స్వాధీనం
- ఆ సొమ్ము తనదేనన్న ఒంగోలు బంగారం వ్యాపారి
- స్టిక్కర్ తన డ్రైవర్ తీసుకువచ్చాడని వెల్లడి
తమిళనాడులోని తిరువళ్లూరు వద్ద కారులో రూ.5.27 కోట్ల నగదు పట్టుబడిన వ్యవహారంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఆ కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడంతో వైసీపీ ఎమ్మెల్యేల పేర్లు వినిపించాయి. కాగా, ఆ డబ్బు తనదేనని చెబుతున్న ఒంగోలు బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు అనే వ్యక్తి తాజాగా మరికొన్ని అంశాలు తెలిపారు. శ్రావణమాసం సందర్భంగా బంగారం కొనేందుకు తమిళనాడు వెళుతున్నట్టు పేర్కొన్నారు.
ఆ డబ్బు తనదేనని, కానీ కారుపై అంటించి ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ మాత్రం డ్రైవర్ తీసుకువచ్చి అతికించాడని వివరించారు. ఆ స్టిక్కర్ గిద్దలూరు శాసనసభ్యుడు అన్నా రాంబాబు పేరిట ఉందని, అయితే దాని వ్యాలిడిటీ ఎప్పుడో ముగిసిందని అన్నారు. తమ డ్రైవర్ ఆ స్టిక్కర్ ఎలా సంపాదించాడో తెలియదని నల్లమల్లి బాలు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన ఒంగోలులో కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఈ బంగారం వ్యాపారి సన్నిహితుడని ప్రచారం జరుగుతోంది.