BSF: ఫేస్ బుక్ పరిచయంతో పాక్ లోని అమ్మాయిని కలిసేందుకు మహారాష్ట్ర నుంచి బైక్ పై ప్రయాణం... బోర్డర్ లో కంచె దాటుతుండగా పట్టివేత!
- మహారాష్ట్ర యువకునికి కరాచీ యువతితో పరిచయం
- ఆమె కోసం పెద్ద సాహసం చేసిన జీషాన్
- అతని కథ విని విస్తుపోయిన బీఎస్ఎఫ్
ఫేస్ బుక్ లో పరిచయమై, ఆపై వాట్సాప్ చాటింగ్, ఫోన్ కాల్స్ తో దగ్గరైన ఓ యువతిని కలిసేందుకు యువకుడు చేసిన సాహసం విఫలమైంది. గుజరాత్ లో బార్డర్ దాటుతుండగా, బీఎస్ఎఫ్ జవాన్లు అతన్ని పట్టేశారు. ఆపై అతని కథను విని విస్తుపోయారు.
వివరాల్లోకి వెళితే, మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ ప్రాంతానికి చెందిన సిద్ధిఖీ మహమ్మద్ జీషాన్ అనే యువకుడు, పాకిస్థాన్ లోని కరాచీ పరిధి, ఫైసల్ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. అమెను కలిసేందుకు గూగుల్ మ్యాప్స్ సాయంతో తన బైక్ పై బయలుదేరాడు.
అలా దాదాపు 1,200 కిలోమీటర్ల ప్రయాణం తరువాత సరిహద్దులకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరానికి చేరుకుని బైక్ ను అక్కడే వదిలేసి, బార్డర్ దాటేందుకు ప్రయత్నించాడు. రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో జీషాన్ చిక్కగా, అతని వద్ద ఉన్న పాన్ కార్డు, ఏటీఎం, ఆధార్ కార్డుల సహాయంతో అతన్ని గుర్తించారు. అంతముందే సరిహద్దులకు దగ్గర్లో అతని బైక్ ను కూడా కనుగొన్న జవాన్లు, అప్పటికే అప్రమత్తం కావడంతో జీషాన్ సరిహద్దు దాటకుండానే చిక్కాడు.
మరోవైపు జీషాన్ అదృశ్యమైనట్టు ఫిర్యాదు అందుకున్న మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, అతని ఫోన్ సిగ్నల్స్ ను ట్రేస్ చేసి, గుజరాత్ లో ప్రయాణిస్తున్నట్టు తెలుసుకుని, అక్కడి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆపై జీషాన్ సరిహద్దుల్లో చిక్కడంతో వారు స్థానిక పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.