Pawan Kalyan: ఏపీలో కొవిడ్ విధులు నిర్వర్తిస్తూ చనిపోయిన వారి కుటుంబాలకు రూ.1 కోటి ఇవ్వాలి: పవన్ కల్యాణ్
- కరోనా పోరాటయోధుల కుటుంబాలను ఆదుకోవాలన్న పవన్
- ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్
- వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని సూచన
కరోనా మహమ్మారిపై ముందు నిలిచి పోరాడుతున్న ఉద్యోగుల సేవలను విస్మరించరాదని, కొవిడ్ విధులు నిర్వర్తిస్తూ చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వానికి సూచించారు.
ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి పరిహారం అందించాలని, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా బారిన పడిన ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగికి వేతనంతో కూడిన నాలుగు వారాల ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని కోరారు. ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు కూడా ఈ విషయంలో సానుభూతితో ఆలోచించాలని సూచించారు.
కరోనా పేరు వింటేనే ప్రతి ఒక్కరూ వణికిపోయే పరిస్థితుల్లో... ఆ వైరస్ బారిన పడినవారికి సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని పవన్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏపీలో 200 మంది వైద్య సిబ్బంది, 600 మంది పోలీసులు కరోనా బారినపడినట్టు తెలుస్తోందని, ప్రాణాలను కూడా లెక్కచేయకుండా రోగులకు సేవలు అందిస్తున్న వారి త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించాలని తెలిపారు.