Varavara Rao: వరవరరావు ప్రాణాలు కాపాడాలని కోరుతున్నా: వెంకయ్యనాయుడికి భూమన లేఖ
- వరవరరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు
- నాకు లభించిన గురువుల్లో వరవరరావు ముఖ్యులు
- ఆయనను విడుదల చేసేలా చొరవ చూపండి
81 ఏళ్ల వయసున్న విరసం నేత వరవరరావు ముంబై జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో ముంబైలోని జేజే ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి లేఖ రాశారు. అనారోగ్యంతో పాటు, కరోనా వైరస్ బారిన పడిన వరవరరావును విడుదల చేసేలా చొరవ చూపాలని లేఖలో కోరారు. 81 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయనపై ప్రభుత్వం దయ చూపాలని పేర్కొన్నారు. వరవరరావు ప్రాణాలు కాపాడాలని ఉపరాష్ట్రపతిని కోరుతున్నానని చెప్పారు.
వరవరరావు అనారోగ్యం, నిర్బంధం గురించి తమకు తెలిసే ఉంటుందని... ఆయన ఆసుపత్రిలో బందీగా ఉన్నారంటే హృదయం చెమ్మగిల్లుతోందని భూమన అన్నారు. 48 ఏళ్ల క్రితం తనలో రాజకీయ ఆలోచనలు ఆవిర్భవించాయని... ఆ దశలో తనకు లభించిన గురువుల్లో వరవరరావు ముఖ్యులని చెప్పారు. 46 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ బాధితులుగా మీరు, నేను 21 నెలల పాటు ముషీరాబాద్ జైల్లో ఉన్నామని... ఆ సమయంలో మన సహచరుడిగా వరవరరావు ఉన్నారని గుర్తుచేశారు. మన భావజాలాలు వేరైనప్పటికీ... మనమంతా మనుషులమని... మానవతా దృక్పథంతో స్పందించి విడుదలకు చొరవ చూపుతారని ఆశిస్తున్నానని ఆయన కోరారు.