Pakistan: పాక్ దుశ్చర్యకు నిరసన.. పాక్ రాయబారికి భారత్ సమన్లు
- పాక్ కాల్పుల్లో ఒకే కటుంబానికి చెందిన ముగ్గురి మృతి
- పాక్ రాయబారి వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్
- భారత పౌరులపై కావాలనే కాల్పులు జరుపుతోందని ఆరోపణ
సరిహద్దులో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు మృతి చెందడాన్ని తీవ్రంగా పరిగణించిన భారత్.. పాకిస్థాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది. పాక్ కాల్పుల్లో అమాయక ప్రజలు మృతి చెందడంపై పాకిస్థాన్ హైకమిషన్‌లోని తాత్కాలిక రాయబారి వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్టు చెప్పిన భారత విదేశాంగ శాఖ ఆయనకు సమన్లు జారీ చేసినట్టు తెలిపింది.
దేశంలోని సాధారణ పౌరులపై పాక్ సైన్యం కావాలనే కాల్పులకు తెగబడుతున్నట్టు పేర్కొంది. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంపైనా నిరసన వ్యక్తం చేసిన భారత్ 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని హితవు పలికింది. కాగా, జమ్మూకశ్మీర్‌లోని కృష్ణ ఘాటీ సెక్టార్‌లో శుక్రవారం పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.