Mithali Raj: ధోనీ, కోహ్లీలను మించిపోయిన మిథాలీ రాజ్
- విజయవంతమైన చేజింగ్ లలో అత్యధిక సగటు
- 107 సగటుతో టాప్ లో నిలిచిన మిథాలీ
- మిథాలీని అందుకోలేకపోయిన ధోనీ, కోహ్లీ
టీమిండియా మహిళల క్రికెట్లో మిథాలీ రాజ్ ఎవరెస్ట్ సమానురాలు అనడంలో సందేహంలేదు. రికార్డు స్థాయిలో 209 వన్డేలు ఆడి 50 సగటుతో 6,888 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20 పోటీల్లో 89 మ్యాచ్ లు ఆడి 2,364 పరుగులు సాధించింది. టెస్టుల్లో డబుల్ సెంచరీ కూడా మిథాలీ సొంతం. తాజాగా, మిథాలీ గణాంకాల్లో ఆసక్తికర అంశం వెల్లడైంది. వన్డేల్లో విజయవంతమైన ఛేజింగ్ ల్లో అత్యధిక సగటు మిథాలీదే.
కనీసం 20 ఇన్నింగ్స్ లను పరిగణనలోకి తీసుకుంటే సక్సెస్ ఫుల్ సెకండ్ ఇన్నింగ్స్ లలో మిథాలీ యావరేజి 107.15 కాగా, టీమిండియా పురుషుల జట్టు దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ కూడా మిథాలీకి దిగువనే ఉన్నారు.
ఈ అంశంలో ధోనీ యావరేజి 102.71 కాగా, కోహ్లీ సగటు 96.21 మాత్రమే. మిథాలీ తర్వాత రెండో స్థానంలో న్యూజిలాండ్ క్రికెటర్ అమీ శాటర్ వైట్ (105.81) నిలిచింది. దీనిపై మిథాలీ రాజ్ స్పందిస్తూ ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఈ విషయం తనకు తెలియదని, సంతోషం కలుగుతోందని పేర్కొంది.