Corona Virus: గుంటూరు జిల్లాలో అమానుషం.. కరోనాతో రోడ్డుపైనే పడి వ్యక్తి మృతి.. సాయం చేయాలంటూ కుమార్తె అరిచినా ఎవరూ రాని వైనం!

Man Died Middle On The Road With Corona in Guntur

  • ఫలితం పాజిటివ్ అని రావడంతో ఎక్కువైన ఆందోళన
  • ఆసుపత్రికి వెళ్తూ రోడ్డుపైనే కుప్పకూలి మృతి
  • నాలుగు గంటల తర్వాత మృతదేహాన్ని తరలించి దహనం చేసిన మునిసిపల్ సిబ్బంది

కరోనా రక్కసి మానవ సంబంధాలను ఎలా చిదిమేస్తోందో చెప్పేందుకు ఈ  ఘటన చక్కని ఉదాహరణ. కరోనా రోగి రోడ్డుపై కుప్పకూలి మరణిస్తే, సాయం అందించాలంటూ ఆయన కుమార్తె ఇరుగు పొరుగుకు చేసిన విజ్ఞప్తులు అరణ్య రోదనే అయ్యాయి. ఒక్కరంటే ఒక్కరు కూడా బయటకు రాకుండా తలుపులు వేసుకున్నారు. ఫలితంగా నాలుగు గంటలపాటు మృతదేహం రోడ్డుపైనే ఉంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిందీ ఘటన.

స్థానిక వావిలాలవారి వీధికి చెందిన వ్యాపారి (60)కి కరోనా పరీక్షలు చేయించుకోగా, కొవిడ్ సోకినట్టు నిన్న ఫలితం వచ్చింది. విషయం తెలిసి ఆందోళనకు గురికావడంతో ఆయాసం ఎక్కువైంది. ఈ క్రమంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో ఆసుపత్రికి వెళ్లేందుకు మధ్యాహ్నం ఒంటిగంటకు ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇల్లు దాటి రెండడుగులు వేశారో, లేదో రోడ్డుపైనే కుప్పకూలి మృతి చెందారు. రోడ్డుపై అచేతనంగా పడిపోయిన తండ్రికి సాయం చేయాలంటూ ఆయన కుమార్తె చేసిన ఆర్తనాదాలు అక్కడున్న ఎవరినీ కదిలించలేకపోయాయి.

బంధువులు, స్థానికులు ఒక్కరంటే ఒక్కరు కూడా సాయం అందించేందుకు బయటకు రాలేదు సరికదా, తలుపులు వేసుకుని నాలుగు గంటలపాటు ఇంట్లోనే ఉండిపోయారు. సమాచారం అందుకున్న మునిసిపల్ అధికారులు స్పందించి సాయంత్రం ఐదు గంటలకు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తరలించి దహన సంస్కారాలు చేశారు. ఆ తర్వాత కానీ స్థానికులు ఎవరూ ఇళ్లలోంచి బయటకు రాలేదు.

  • Loading...

More Telugu News