ICC: వచ్చే ఏడాదికి వాయిదా పడిన టీ20 ప్రపంచ కప్... ఐపీఎల్ కు మార్గం సుగమం!

ICC postponed world cup event to be held in Australia
  • ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 మెగా ఈవెంట్
  • ఆస్ట్రేలియాలో కరోనా విజృంభణ
  • ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేయనున్న బీసీసీఐ!
ఆస్ట్రేలియాలో అక్టోబరులో జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదాపడింది. ఈ టోర్నీని వచ్చే ఏడాది నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ మేరకు ఐసీసీ ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి ఈ మెగా ఈవెంట్ అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు ఆస్ట్రేలియా గడ్డపై జరగాల్సి ఉంది.

కరోనా వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో ఆస్ట్రేలియాలో వైరస్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. దాంతో టోర్నీ జరిగేది ఖాయమేననిపించింది. అయితే లాక్ డౌన్ ఆంక్షలు సడలించారో, లేదో ఆస్ట్రేలియాలో కరోనా కట్టలు తెంచుకుంది. భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు రావడంతో అక్కడి ప్రభుత్వం పునరాలోచనలో పడింది. టోర్నీ నిర్వహణపై చివరి వరకు ఊగిసలాడిన సర్కారు, నిస్సహాయత వ్యక్తం చేయడంతో చేసేదేమీలేక ఐసీసీ కూడా టోర్నీని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

ఇక, ఈ ఏడాది ప్రపంచకప్ జరగకపోతే, ఆ విరామంలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ గట్టి పట్టుదలతో ఉంది. ముఖ్యంగా, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఐసీసీ ప్రకటన కోసం కాచుకుని ఉన్నాడంటే అతిశయోక్తి కాదు. లీగ్ నిర్వహణకు ప్రధాన అడ్డంకి తొలగిపోయిన నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ ను ప్రకటించడం ఇక లాంఛనమే కానుంది.

ICC
T20 World Cup
Australia
Postpone
IPL

More Telugu News