Madhya Pradesh: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత
- శ్వాసకోశ, మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న లాల్జీ
- గత నెల 11 నుంచి లక్నోలోని మేదాంతలో చికిత్స
- ఈ ఉదయం కన్నుమూత
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ (85) ఈ ఉదయం కన్నుమూశారు. టాండన్ కుమారుడు, యూపీ మంత్రి అశుతోష్ టాండన్ లాల్జీ మృతిని ధ్రువీకరించారు. శ్వాసకోశ సమస్యలు, జ్వరం, మూత్ర విసర్జనలో ఇబ్బందులు తలెత్తడంతో గత నెల 11న లక్నోలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు.
దీంతో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు కేంద్రం మధ్యప్రదేశ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లాల్జీ పరిస్థితి రోజురోజుకు మరింత క్షీణించింది. ఆయన శరీరం చికిత్సకు సహకరించడం మానేసింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మరింత దిగజారడంతో ఈ ఉదయం కన్నుమూసినట్టు మేదాంత ఆసుపత్రి డైరెక్టర్ రాకేశ్ కపూర్ తెలిపారు. కాగా, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అనుచరుడిగా భారతీయ జనతా పార్టీతో ఆయన రాజకీయ జీవితం పెనవేసుకుపోయింది. యూపీ రాజకీయాలలో ఆయనది ఘనమైన చరిత్ర. మాయావతి (సంకీర్ణ ప్రభుత్వం), కల్యాణ్ సింగ్ మంత్రివర్గాలలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు.