Prakash Javadekar: మీరు ఈ ఆరు నెలల్లో ఈ విజయాలు సాధించారు!: రాహుల్ గాంధీకి బీజేపీ కౌంటర్
- ఫిబ్రవరిలో షహీన్ బాగ్ ఆందోళనలు, అల్లర్లు..
- మార్చిలో మధ్యప్రదేశ్‌ను కోల్పోయారు
- ఏప్రిల్లో వలస కార్మికులను రెచ్చగొట్టారు
- కొవ్వొత్తులు వెలిగించడాన్ని హేళనచేసి ప్రజలను అవమానించారు
కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శల పట్ల బీజేపీ ఘాటుగా సమాధానం ఇచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని మోదీ ఆరు విజయాలు సాధించారంటూ ఎద్దేవా చేస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టింది.
''రాహుల్ గాంధీ.. ఈ ఆరు నెలల్లో మీరు సాధించిన ఈ ఆరు విజయాలను గుర్తించండి'' అంటూ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు.
'ఫిబ్రవరి- షహీన్ బాగ్ ఆందోళనలు, అల్లర్లు..
మార్చి- మధ్యప్రదేశ్‌తో పాటు జోతిరాదిత్యను మీరు వదులుకోవాల్సి వచ్చింది
ఏప్రిల్- వలస కార్మికులను రెచ్చగొట్టడం
మే- కాంగ్రెస్ చారిత్రక ఓటమికి ఆరో వార్షికోత్సవం
జూన్- చైనాకు మద్దతివ్వడం
జులై- రాజస్థాన్‌లో కాంగ్రెస్ పరిస్థితులు తలకిందులవడం'
అంటూ ప్రకాశ్ జవదేకర్ కౌంటర్ ఇచ్చారు.
'రాహుల్ బాబా.. ఇటీవల భారత్ చైనాపై సాధించిన విజయాన్ని గుర్తించండి. భారత్‌లో కరోనా కేసుల సగటు అమెరికా, యూరప్, బ్రెజిల్ కంటే తక్కువగా ఉంది. కొవ్వొత్తులు వెలిగించడాన్ని అవహేళన చేసి మీరు దేశ ప్రజలను, కరోనా యోధులను అవమానించారు' అని జవదేకర్ పేర్కొన్నారు.
కాగా, రాహుల్ గాంధీ ఈ రోజు ఉదయం మోదీపై విమర్శలు చేస్తూ... 'ఫిబ్రవరిలో నమస్తే ట్రంప్, మార్చిలో మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల్చడం, ఏప్రిల్లో ప్రజలతో కొవ్వొత్తులు వెలిగింపజేయడం, మేలో ఎన్డీఏ ప్రభుత్వ ఆరో వార్షికోత్సవం జరుపుకోవడం, జూన్‌లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల వర్చువల్ ర్యాలీలు నిర్వహించడం, జులైలో రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేయడం' వంటి ఆరు విజయాలు సాధించారని ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే.