Raghurama Krishnaraju: "ఈ రెండు వారాలు మీరెక్కడుంటారు?" అని రాష్ట్రపతి అడిగితే "మీ ఇంటికి కూతవేటు దూరంలోనే" అని చెప్పాను: రఘురామకృష్ణరాజు
- ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసిన నరసాపురం ఎంపీ
- తనకు భద్రత కల్పించే విషయమై చర్చ
- రాష్ట్రపతి భరోసా ఇచ్చారన్న రఘురామకృష్ణరాజు
- పార్టీకి, ప్రభుత్వానికి తేడా తెలుసుకోవాలంటూ వైసీపీ శ్రేణులకు హితవు
సొంత పార్టీ వైసీపీపై తిరుగుబాటు చేసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. ఇటీవలి పరిణామాలపై రాష్ట్రపతితో మాట్లాడినట్టు రఘురామకృష్ణరాజు వెల్లడించారు. తిరుమల శ్రీవారి భూముల అమ్మకం, ఇసుక అక్రమాలు, ఇళ్ల స్థలాల వ్యవహారంలో ప్రశ్నించానని, దాంతో వైసీపీ నేతలు తనకు వ్యతిరేకంగా మారారని, వారి అనుచరులతో కేసులు పెట్టించారని, తన దిష్టిబొమ్మలు దగ్ధం చేయించి, ఆ గతే తనకూ పడుతుందని హెచ్చరించిన విషయాన్ని రాష్ట్రపతికి వివరించానని తెలిపారు. వీటికి సంబంధించిన ఫొటోలను కూడా ఆయనకు సమర్పించానని చెప్పారు.
కేంద్ర బలగాలతో భద్రత కోరుతూ తాను లోక్ సభ స్పీకర్ కు లేఖ రాసిన విషయం, ఆ లేఖను ఆయన కేంద్ర హోంశాఖకు పంపిన విషయం కూడా వివరించానని, కోర్టుకు వెళ్లిన విషయం, రెండువారాల్లో నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశాలను కూడా ఆయనకు విన్నవించానని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా, ఈ రెండు వారాలు ఎక్కడుంటారని రాష్ట్రపతి ప్రశ్నించారని, మీ ఇంటికి కూతవేటు దూరంలోనే ఉంటున్నాను సార్ అని చెప్పానని వివరించారు.
"దాంతో ఆయన, ఇదంతా రక్షిత ప్రాంతం... మీరు ఈ రెండు వారాలు ఇక్కడే ఉండండి, తప్పకుండా మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పారు. నా సమస్యలు వినేందుకు ఆయన ఎంతో సమయం ఇచ్చారు. నా సమస్యలతో పాటే ఏపీ రాజధాని సమస్య, ఇతర ప్రజాసమస్యలు కూడా ఆయనకు వివరించాను" అంటూ రాష్ట్రపతితో భేటీ వివరాలు పంచుకున్నారు.
అంతేకాకుండా, రఘురామకృష్ణరాజు ఏపీ రాజధాని అంశంపై తనదైన శైలిలో స్పందించారు. పార్టీకి, ప్రభుత్వానికి తేడా తెలియకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అమరావతిపై తాను ఇంత ధైర్యంగా మాట్లాడడానికి కారణం అది తమ పార్టీ నిర్ణయం కాదు గనుకనే అని స్పష్టం చేశారు. వైసీపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తీసుకున్న కొత్త నిర్ణయం కాబట్టే ఆ నిర్ణయంపై మాట్లాడుతున్నానని తెలిపారు.
పార్టీ నిర్ణయం ఏంటో ముఖ్యమంత్రి గృహప్రవేశం సందర్భంగా పార్టీ నేత రోజా కూడా ఉద్ఘాటించారని, సీఎం అంతటివాడే రాజధానిలో ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేశారని, చంద్రబాబుకు ఇక్కడ ఇల్లు కూడా లేదని రోజా స్పష్టంగా చెప్పారని రఘురామకృష్ణరాజు వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ ఈ విషయంలో ఒక్కసారి మాట ఇస్తే తప్పే వంశం కాదని చెప్పారని గుర్తు చేశారు. అందుకే రాజధాని తరలింపు పార్టీ నిర్ణయం కాదు గనుక, ప్రభుత్వ నిర్ణయం గనుక దీన్ని వ్యతిరేకించే హక్కు ఉందని భావిస్తున్నానని తెలిపారు. అభిమానులకు, దురభిమానులకు తాను చెప్పేది ఒక్కటేనని, పార్టీకి, ప్రభుత్వానికి తేడా తెలుసుకోవాలని హితవు పలికారు.