Chandrababu: మాస్కు ధరించాలని చెబుతున్న జగనే ఇంతవరకు మాస్క్ వాడలేదు: చంద్రబాబు
- కరోనా కట్టడిలో విఫలమయ్యారంటూ విమర్శలు
- కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై సీరియస్
- పార్టీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని చెబుతున్న సీఎం జగన్ ఇంతవరకు మాస్కు ధరించలేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇప్పటివరకు మాస్కు ధరించని సీఎం, ఇతరులు మాస్కు ధరించకపోతే జరిమానా వేస్తామనడం సరికాదని అన్నారు. ఏపీలోని 175 నియోజకవర్గాల టీడీపీ ఇన్ చార్జులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం చేతకానితనం వల్ల రాష్ట్రంలో కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతోందని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు వ్యవహారాన్ని చంద్రబాబుకు నివేదించారు. కావాలనే ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించారని ఎమ్మెల్సీ చెప్పడంతో చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యారు. ఇకపై ఎన్టీఆర్ విగ్రహాలను తాకితే వైసీపీ నేతలకు వణుకు పుట్టేలా టీడీపీ శ్రేణుల చర్యలు ఉండాలని స్పష్టం చేశారు. కావలి ఉదంతాన్ని అంత తేలిగ్గా విడిచిపెట్టవద్దని నెల్లూరు జిల్లా నేతలకు సూచించారు.