Taneti Vanita: మంత్రి తానేటి వనితకు చేదు అనుభవం.. అడ్డుకున్న దళిత సంఘాలు!
- శిరోముండనానికి గురైన దళిత యువకుడిని పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ నేతలు
- ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ దళిత సంఘాల ఆగ్రహం
- దీనికి కారణమైన వైసీపీ నేతను అరెస్ట్ చేయాలని డిమాండ్
మంత్రి తానేటి వనితకు చేదు అనుభవం ఎదురైంది. తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం పోలీస్ స్టేషన్ లో శిరోముండనానికి గురైన ప్రసాద్ అనే దళిత యువకుడిని పరామర్శించేందుకు ఆమె వచ్చారు. రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రిలో దళిత యువకుడు చికిత్స పొందుతున్నాడు. అతడిని పరామర్శించేందుకు వచ్చిన వనితను దళిత సంఘాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా ఆమెతో పాటు వైసీపీ నేతలు జక్కంపూడి రాజా, మేరుగ నాగార్జున కూడా ఉన్నారు.
దళిత యువకుడికి శిరోముండనం చేస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికంతటికీ కారణమైన వైసీపీ నేతను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కదలనివ్వబోమని వనితను నిలబెట్టారు. దళిత బాలికపై 10 మంది నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేస్తే మీరు ఇంత వరకు ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి దళిత నేతలు, కార్యకర్తలను పక్కకు నెట్టేసి ఆమెను అక్కడి నుంచి పంపించివేశారు.